ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: సీఎం కేసీఆర్ ఏం కోరినా.. వెంటనే నిధులు మంజూరు చేస్తున్నారని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. దేశంలో బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు అందరూ కలిసిరావాలన్నారు. సోమవారం స్టేషన్​ఘన్​పూర్​లో రూ.2.85కోట్లతో చేపట్టిన సీసీ రోడ్లు, జీపీ అడిషనల్​బిల్డింగ్, ప్లేగ్రౌండ్, కమ్యూనిటీ హాల్ లను ప్రారంభించారు. దళితబంధు లబ్ధిదారుడు గోవిందు అశోక్​ఏర్పాటు చేసుకున్న ఎలక్ట్రానిక్స్ షాప్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు కోలాటాలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ.. దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి ప్రధాన అంశాలుగా సీఎం కేసీఆర్  బీఆర్ఎస్​ను స్థాపించి, బీజేపీపై యుద్ధం చేస్తున్నారని తెలిపారు. దళితబంధు అందరికీ వస్తుందని, ఆందోళన చెందవద్దన్నారు. కేసీఆర్​ను అడిగిన వెంటనే స్టేషన్ ఘన్ పూర్ కు మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ, ఫైర్ స్టేషన్ మంజూరు చేశారని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్​డీవో రాంరెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా అధికార ప్రతినిధి సురేశ్​కుమార్, స్టేషన్​ఘన్​పూర్, జఫర్​గఢ్​ ఎంపీపీలు కందుల రేఖ, రడపాక సుదర్శన్, మార్కెట్ చైర్మన్​గుజ్జరి రాజు, జడ్పీటీసీ మారపాక రవి, పీఏసీఎస్​ డైరెక్టర్ తోట సత్యం, ఈవో సత్యనారాయణ ఉన్నారు. 

అక్కర్లేని చోట బస్తీ దవాఖాన!  లీడర్ల పైరవీలకే ఆఫీసర్ల మొగ్గు?

జనగామ, వెలుగు: జనగామ జిల్లా కేంద్రంలో బస్తీ దవాఖాన ఏర్పాటుపై విమర్శలు వ్యక్తం అవుతున్నారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉన్నచోట ఏర్పాటు చేయాల్సిన ఆఫీసర్లు.. పొలిటికల్ లీడర్ల ఒత్తిడికి తలొగ్గారు. అవసరం ఉన్న చోటును వదిలి, జిల్లా ఆసుపత్రి పక్కనే దీనిని ఏర్పాటు చేస్తున్నారు. జనగామలోని ఈ–సేవ సెంటర్ బిల్డింగ్ ప్రభుత్వాసుపత్రి పక్కనే ఉండగా.. ఇందులో బస్తీ దవాఖానా ఏర్పాటుకు పనులు ప్రారంభించారు. ఈ బిల్డింగ్ రినోవేషన్ కు రూ.13లక్షలు మంజూరు అయ్యాయి. వాస్తవానికి సూర్యాపేట, హైదరాబాద్, హనుకొండ రూట్ లలో పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆయా ప్రాంతాలకు జిల్లా ఆసుపత్రి దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు దగ్గరగా ఉండే చోట ఏర్పాటు చేయాల్సిన బస్తీ దవాఖానాను జిల్లా ఆసుపత్రి పక్కనే ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. కొందరు లీడర్ల ఒత్తిడితోనే ఇలా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


‘కంటి వెలుగు’ను సక్సెస్ చేయండి

పరకాల, వెలుగు: కంటి వెలుగును ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు సక్సెస్ చేయాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కోరారు. సోమవారం పరకాలలో తన క్యాంప్ ఆఫీసులో ఆయన రివ్యూ నిర్వహించారు. డాక్టర్లు ప్రతి గ్రామానికి వచ్చి, టెస్టులు చేస్తారని, ఉచితంగా అద్దా లు పంపిణీ చేస్తారని తెలిపారు. పరకాల మున్సిపాలిటీతో పాటు పరకాల, నడికూడ, ఆత్మకూరు, దామెర మండలాల్లో మొత్తం 75 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


ఎమ్మెల్యే అక్రమాలపై సీఎంకు ఫిర్యాదు చేస్తా..బలరాం నాయక్

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అవినీతి, అక్రమాలపై సీఎం కేసీఆర్, గవర్నర్​కు ఫిర్యాదు చేస్తానని కాంగ్రెస్ సీనియర్​ నేత, కేంద్ర మాజీ సహాయ మంత్రి బలరాం నాయక్ అన్నారు. సోమవారం గూడూర్ మండలం గాజులగట్టుకు చెందిన వార్డు మెంబర్, ఇతర నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా.. వారికి కండువాలు కప్పారు. ఈ సందర్భంగా బలరాం నాయక్​మాట్లాడుతూ.. బీఆర్ఎస్ లీడర్లు అధికారాన్ని అడ్డంపెట్టుకుని కాంగ్రెస్ లీడర్లను వేధిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అందరి భరతం పడుతామన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ గూడూరు మండలాధ్యక్షుడు కత్తి స్వామి, లీడర్లు యాకుబ్ పాషా,  అమరేందర్ రెడ్డి, బుడిగె సతీశ్, ఎలికట్టె వెంకన్న తదితరులున్నారు.


టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ల సస్పెన్షన్  సీఐ, ఇద్దరు హెడ్‍ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్‍  పై వేటు

వరంగల్‍, వెలుగు: వరంగల్‍ కమిషనరేట్లో అవినీతి అధికారులు, సిబ్బందిపై సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఈసారి టాస్క్ ఫోర్స్ వంతు వచ్చింది. అక్రమార్కుల వద్ద  వసూళ్లకు పాల్పడి కేసులు లేకుండా చేసిన ఘటనలో  టాస్క్ ఫోర్స్​ సీఐ వి.నరేశ్‍కుమార్‍, హెడ్‍ కానిస్టేబుళ్లు పి.శ్యాంసుందర్‍, కె.సోమలింగం, కానిస్టేబుల్‍ బి.సృజన్‍ను సస్పెండ్‍ చేస్తూ సీపీ ఏవి.రంగనాథ్‍ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పీడీఎస్‍ రైస్‍ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా సభ్యుల వద్ద లంచాలు తీసుకుని కేసులు పెట్టకుండా సహకరించినట్లు నిర్ధారణ కావడంతో చర్యలు తీసుకున్నట్లు సీపీ వెల్లడించారు.