అందుకే రాజకీయాలకు దూరంగా ఉన్నా : రజనీ కాంత్

అందుకే రాజకీయాలకు దూరంగా ఉన్నా : రజనీ కాంత్

రాజకీయాలకు దూరంగా ఉండడంపై సూపర్ స్టార్ రజనీ కాంత్ క్లారిటీ ఇచ్చారు. తనకు మూత్రపిండాల సమస్య ఉండటం వల్లే రాజకీయాలకు దూరమయ్యానని వెల్లడించారు. మార్చి 11న రాత్రి చెన్నైలోని మ్యూజిక్‌ అకాడమీలో జరిగిన సేఫియన్స్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ రజతోత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడితో కలిసి రజనీ కాంత్ అతిథిగా పాల్గొన్నారు. మూత్రపిండాల సమస్యతో చికిత్స పొందుతున్నప్పుడే రాజకీయాల్లోకి రావాలనుకున్నాన్నారు. కానీ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనరాదని అప్పట్లో డాక్టర్‌ రాజన్‌ రవిచంద్రన్‌ సలహా ఇచ్చారన్నారని చెప్పారు.

కరోనా సమయంలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా చాలామంది తనకు ఇదే సలహా ఇచ్చారని రజనీ కాంత్ తెలిపారు. బహిరంగ సభల్లోనూ పాల్గొనలేని పరిస్థితి ఏర్పడిందని, అందువల్లే రాజకీయాల నుంచి వైదొలిగానని రజనీకాంత్ స్పష్టం చేశారు. ఈ విషయాలన్నీ చెబితే తాను భయపడుతున్నానని అనుకుంటారని, అందుకే ఎక్కడా చెప్పలేదని వివరించారు.