ప్రైవేట్ దవాఖాన్లలో డయాలసిస్ దందా

ప్రైవేట్ దవాఖాన్లలో డయాలసిస్ దందా

నల్గొండ, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు దవాఖానాల్లో డయాలసిస్​దందా జోరుగా సాగుతోంది. ఆరోగ్య శ్రీ, ఎంప్లాయీస్​హెల్త్​ స్కీం కింద ప్రభుత్వం కిడ్నీ రోగులకు ఉచితంగా డయాలసిస్​ సేవలు అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల మంది కిడ్నీ బాధితులుండగా.. జిల్లా, ఏరియా దవాఖానాలతో కలిపి 83 డయాలసిస్​ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఈ​ సెంటర్లలో మెషీన్లు పాతవి కావడం, ఎమర్జెన్సీ సేవలతో పాటు డాక్టర్ల పర్యవేక్షణ లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు హాస్పిటల్స్​పేషెంట్లకు మాయమాటలు చెప్పి సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రభుత్వం డయాలసిస్​సెంటర్ల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించి చేతులు దులుపుకొంది. సెంటర్లలో ఎలాంటి ట్రీట్​మెంట్​జరుగుతోందన్న విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. డయాలసిస్​సెంటర్లలో టెక్నీషియన్లే డాక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సెంటర్లను గాంధీ, ఉస్మానియా, నిమ్స్​దవాఖానలకు అనుసంధానించడంతో.. ఇక్కడి నెఫ్రాలజీ డాక్టర్లు ఇచ్చే సూచనలతోనే టెక్నీషియన్లు నడిపిస్తున్నారు. పాత జిల్లా కేంద్రాలు, ఏరియా దవాఖానాలున్నచోట డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు. డయాలసిస్ బాధితుల్లో చాలామందికి వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో తీవ్ర ఆయాసం, కాళ్లవాపులు, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అలాంటి పేషెంట్లకు సకాలంలో వైద్యం అందడం లేదు. సెంటర్లలో ఆక్సిజన్​ సౌకర్యం లేకపోవడం, ఎమర్జెన్సీ సేవలు కూడా అందుబాటులో లేకపోవడంతో బాధితులు ప్రైవేటు ఆసుపత్రులకు పరుగెత్తాల్సి వస్తోంది. ఆర్థికభారం భరించలేని పేషెంట్లు ప్రభుత్వ సెంటర్ల వద్దే డయాలసిస్​ కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. 

పాత మెషీన్లతో ఇబ్బందులు

డయాలసిస్​సెంటర్లలో మెషీన్లు పాతపడిపోయాయి. తరచూ రిపేర్లు చేయాల్సి వస్తోంది. హైదరాబాద్​ నుంచి టెక్నిషియన్లు వస్తే తప్ప రిపేర్​ చేయించలేని పరిస్థితి. మెషీన్లు సరిగా పనిచేయకపోవడంతో పేషెంట్లకు నాలుగు గంటలు జరగాల్సిన డయాలసిస్​మూడు గంటలతో సరిపెడుతున్నారు. పేషెంట్లలో షుగర్, బీపీ లెవల్స్ ​కంట్రోల్​ కాకపోవడంతో డయాలసిస్​ మధ్యలోనే ఆపేస్తున్నారు. దీంతో రక్తం సరిగా శుద్ధిగాక క్రియాటిన్ ​లెవల్స్ కంట్రోల్​ కావడం లేదు. పేషెంట్లలో వాటర్ ​లెవల్స్​తగ్గకపోవడంతో ఊపిరితిత్తులు, గుండెలోకి నీరు ప్రవేశించి తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. సర్కార్​ ఉచితంగా ఇస్తున్న మందులు కూడా సరిగా పనిచేయడం లేదు. బ్లడ్, ఐరన్​ ఇంజక్షన్లు నాసిరకంగా ఉంటున్నాయని, వాటిద్వారా రోగి శరీరంలో హిమోగ్లోబిన్ ​పర్సంటేజీ అంతగా పెరగట్లేదని హైదరాబాద్​ నిమ్స్​నెఫ్రాలజీ నిపుణులు చెబుతున్నారు. డయాలసిస్ సరిగా​ జరగకపోవడంతో జిల్లాల నుంచి చాలామంది పేషెంట్లు ట్రీట్మెంట్​కోసం మళ్లీ నిమ్స్, గాంధీ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. 

అందినంతా దోచుకుంటున్నరు

డయాలసిస్​ పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు కిడ్నీ బాధితుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నాయి. కార్పొరేట్​వైద్యం పేరిట కొందరు ప్రైవేటు వ్యక్తులు, డాక్టర్లు కుమ్మక్కై పెద్ద దందానే నడిపిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో డయాలసిస్​ పెద్ద వ్యాపారంగా మారిపోయింది. ఒక్కసారి డయాలసిస్​ చేస్తే రూ. 3,500 వసూలు చేస్తున్నారు. సాయంత్రం 6 గంటలు దాటితే ఎమర్జెన్సీ సేవల పేరిట రూ. 20 నుంచి 30 వేల వరకు బిల్లు వేస్తున్నారు. పేషెంట్ కండీషన్​ బాగాలేదని చెప్పి అబ్జర్వేషన్​పేరిట రెండు, మూడు రోజులపాటు ఐసీయూలోనే ఉంచుకుని రూ. 2 లక్షలకు పైగా బిల్లులు వేస్తున్నారు. ఆరోగ్య శ్రీ, హెల్త్​ స్కీం వెసులుబాటు ఉన్న ఆసుపత్రుల్లో సైతం పేషెంట్లనున అందినకాడికి దోచుకుంటున్నారు. ఇంకొన్ని ఆసుపత్రులైతే ఆరోగ్యశ్రీ బిల్లులు ప్రభుత్వం ఇవ్వడం లేదని చెప్పి కేవలం మెడికల్​ రీయింబర్స్​మెంట్​పేషెంట్లనే అడ్మిట్​ చేయించుకుంటున్నాయి. ప్రభుత్వ సెంటర్లలో డయాలసిస్​ కిట్​ఒక్కసారి వాడితే.. ప్రైవేటు సెంటర్లలో నాలుగైదుసార్లు వాడుతున్నారు. దీనివల్ల పేషెంట్లు గుండె, లివర్​ సంబంధిత రోగాల బారిన పడుతున్నారు. 

ఏటా మూడు వేల కొత్త కేసులు

రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 15 వేల మంది డయాలసిస్​పేషెంట్లు ఉన్నారు. ప్రతి ఏటా మూడు వేల కొత్త కేసులు పెరుగుతుండగా, వివిధ రకాల కారణాలతో ఏటా రెండు వేల మంది చనిపోతున్నారు. షుగర్, హైబీపీ వంటి సమస్యలే కిడ్నీలు చెడిపోవడానికి ప్రధాన కారణాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇటీవల జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించిన రిపోర్ట్​ప్రకారం 2014–-15లో 2.90 లక్షల డయాలసిస్​లు జరిగితే 2022–-23 నాటికి 5.48 లక్షల డయాలసిస్​లు జరిగాయి. ఉచితంగా అందిస్తున్న డయాలసిస్​ సెషన్లు రాష్ట్రంలో 50 లక్షలు దాటాయని ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు సైతం వెల్లడించారు. 

వెల్​నెస్​ సెంటర్ల మందుల్లోనూ తేడా

కిడ్నీ బాధితులకు నిమ్స్, గాంధీ, ఉస్మానియా నెఫ్రాలజి నిపుణులు వాడమని చెప్తున్న మందులకు, ప్రభుత్వం వెల్​నెస్​ సెంటర్ల ద్వారా ఉచితంగా ఇస్తున్న మందులకు చాలా తేడా ఉంటోంది. వెల్​నెస్​సెంటర్లలో మందులు సరిగా పనిచేయడం లేదని పేషెంట్లు చెబుతున్నారు. 400, 500 ఎంజీ టాబ్లెట్లు మాత్రమే వెల్​నెస్​సెంటర్లలో దొరుకుతున్నాయి. కానీ డాక్టర్లు 1000 ఎంజీ టాబ్లెట్లను వాడమని చెప్తున్నారు. పైగా సకాలంలో మందులు సప్లై కావడం లేదు. దీంతో బాధితులు ప్రైవేటు మెడికల్​ షాపుల్లో మందులు కొనుక్కోవాల్సి వస్తోంది.