
- శుభకార్యాలు, ఇతర వేడుకల్లోస్టీల్ సామగ్రి వాడకం మస్ట్
- సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను తగ్గించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్ణయం
- రూ. 2.54 కోట్లతో పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంపిణీ
- నియోజకవర్గంలోని 276 మహిళా సంఘాలకు వీటి నిర్వహణ బాధ్యతలు
- ఈనెల 17న లాంఛనంగా ప్రారంభించనున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
సిద్దిపేట/కోహెడ, వెలుగు: గ్రామాల్లో ప్లాస్టిక్ వాడకం తగ్గించి స్టీల్ వస్తువుల వినియోగం పెంచేందుకు స్టీల్ బ్యాంకులు ఏర్పాటవుతున్నాయి. హుస్నాబాద్ సెగ్మెంట్ లోని 164 గ్రామాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో వీటి నిర్వహణను కొనసాగించనున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2.54 కోట్ల వ్యయంతో అవసరమైన సామగ్రి అందించనున్నారు. స్టీల్ బ్యాంకుల్లో టిఫిన్, లంచ్ ప్లేట్స్, కప్స్, వాటర్, టీ గ్లాసులు, డిష్ లు, బకెట్లు, చెంచాలతో పాటు భోజనాలకు అవసరమైన వంట గిన్నెలను అందుబాటులో ఉంచనున్నారు.
ప్రస్తుత కాలంలో శుభకార్యాలు, ఇతర వేడుకల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. వాటి స్థానంలో స్టీల్ బ్యాంకుల ఏర్పాటు చేసి.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మెటీరియల్ ను నియంత్రించనున్నారు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా స్టీల్ వస్తువుల వాడకం వైపుగా జనాలను మళ్లించనున్నారు. ప్లాస్టిక్ ను విరివిగా వాడుతుండడంతో రోగాల బారిన వారి సంఖ్య పెరిగిపోతుండడంతో స్టీల్ బ్యాంకులు ఏర్పాటుచేయాలని భావించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు మంత్రి కృషి
హుస్నాబాద్ ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా ప్లాస్టిక్ వాడకాన్ని క్రమంగా తగ్గించడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్ణయించారు. తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సెగ్మెంట్ లోని 7 మండలాలతో పాటు హుస్నాబాద్ మున్సిపాల్టీలో స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నారు.
నామ మాత్రం రుసుముతో శుభకార్యాలకు స్టీల్ బ్యాంకుల సామగ్రిని వాడుకునే విధంగా మహిళా సంఘాలు అందించనున్నారు. గ్రామాల్లో వీవోలు, టౌన్ లో స్లమ్, టౌన్ లెవల్ కమిటీల ఆధ్వర్యంలో వీటి నిర్వహణ ఉంటుంది. సిద్దిపేట సెగ్మెంట్ లో నాలుగేండ్ల కిందటే స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. గతేడాది ఎకనామిక్ సర్వేలో సిద్దిపేట స్టీల్ బ్యాంకుల గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే.
ప్రారంభించనున్న రాష్ట్ర గవర్నర్
ఈనెల17న కోహెడ మండల కేంద్రంలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లాంఛనంగా ప్రారంభించి, 276 మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకులను అందజేస్తారు. ఇందుకు జిల్లా కలెక్టర్ కె.హైమావతి సభ నిర్వహించే స్థలాన్ని పరిశీలించి తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గవర్నర్ పర్యటనలో భాగంగా హెలిపాడ్ కోసం స్థలాన్ని పరిశీలించారు. కొహెడలోని లక్ష్మి గార్డెన్ , హైస్కూల్ గ్రౌండ్, సబ్ స్టేషన్ సమీపంలోని ఖాళీ స్థలాలను గుర్తించినా ఇంకా ఫైనల్ చేయలేదు. గ్రామ సమీపంలోని ఖాళీ స్థలంలో హెలీపాడ్ ఏర్పాట్లు చేస్తున్నారు.
మహిళా సంఘాలకు నిర్వహణ బాధ్యతలు
హుస్నాబాద్ నియోజకవర్గంలోని 8 మండలాల్లో మొత్తం 6,443 మహిళా సంఘాల్లో 69,706 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో సెర్ప్ కింద 164 గ్రామాల్లోని 276 మహిళా సంఘాలు, మెప్మా కింద హుస్నాబాద్ మున్సిపాల్టీలోని 20 వార్డుల్లో 22 మహిళా గ్రూపులకు స్టీల్ బ్యాంకులను అందించనున్నారు. ఒక్కో స్టీల్ బ్యాంకులో 500 స్టీల్ లంచ్ ప్లేట్లు, 250 టిఫిన్ ప్లేట్లు, 250 చొప్పున స్టీల్ డ్రింకింగ్, టీ గ్లాస్ లు, స్టీల్ రైస్ డిష్ లు, బకెట్లు, గంటెలతో పాటు భోజన తయారీకి అవసరమైన వంట గిన్నెలను అందుబాటులో ఉంచనున్నారు. మహిళా సంఘాలకు పంపిణీ చేసే స్టీల్ సామగ్రి ఇప్పటికే మండల కేంద్రమైన కోహెడకు చేరుకున్నాయి.