మణిపూర్ లో శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు

మణిపూర్ లో శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు
  • గవర్నర్ చైర్ పర్సన్ గా ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం   
  • ఘర్షణ పడుతున్న వర్గాలతో చర్చలు జరపనున్న కమిటీ
  • సీఎం బీరెన్ సింగ్ తో అస్సాం సీఎం హిమంత భేటీ

న్యూఢిల్లీ: అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ లో శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ రాష్ట్ర గవర్నర్ అనసూయ ఉయికే చైర్ పర్సన్ గా పీస్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల లీడర్లు, ప్రజాసంఘాల నాయకులు, మాజీ అధికారులు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు, ఆర్టిస్టులు, సోషల్ వర్కర్లు, వివిధ వర్గాల ప్రతినిధులు ఉంటారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. ‘‘ఈ కమిటీ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేస్తుంది. గొడవ పడుతున్న వర్గాలతో చర్చలు జరుపుతుంది. వాళ్లలో అవగాహన కల్పించి, సామాజిక ఐక్యతను బలోపేతం చేస్తుంది” అని పేర్కొంది. కాగా, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ శనివారం ఇంఫాల్ లో మణిపూర్ సీఎం ఎన్.బీరెన్ సింగ్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితిపై చర్చించారు. ‘‘హిమంత కేంద్రం నుంచి సమాచారం తీసుకొచ్చారు. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు అన్ని విధాల సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పరిస్థితిపై ప్రధాని మోడీకి వివరించి, మళ్లీ కొన్ని రోజులకు తిరిగి వస్తానని చెప్పారు” అని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. 

ఉన్నతాధికారుల బదిలీ..

మణిపూర్ లో శుక్రవారం మళ్లీ హింసాత్మక ఘటనలు జరిగాయి. మిలిటెంట్లు ముగ్గురిని కాల్చి చంపగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన ఇంఫాల్ వెస్ట్ జిల్లా బార్డర్ లోని ఖోకెన్ గ్రామంలో జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున కొంతమంది ఆర్మీ దుస్తుల్లో గ్రామానికి వచ్చారు. తమ దగ్గరున్న తుపాకులతో గ్రామస్తులపై ఫైరింగ్ చేశారు. శబ్దం విని భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకోగా, మిలిటెంట్లు పారిపోయారు. మరో రెండు జిల్లాల్లో కొంతమంది ఇండ్లను తగులబెట్టారు. ఈ ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొంతమంది ఉన్నతాధికారులను బదిలీ చేసింది. వీరిలో ఐఏఎస్ ఆఫీసర్లు, 11 మంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. కాగా, గత కొన్ని రోజులుగా మణిపూర్ లో అక్కడి తెగల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 100 మంది చనిపోగా, 300 మందికి పైగా గాయపడ్డారు.

ప్రధానిపై ఖర్గే ఫైర్..

మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోడీ ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. మోడీ మౌనం.. పుండుపై కారం చల్లినట్టుగా ఉందని ఫైర్ అయ్యారు. కనీసం శాంతికి ఆయన పిలుపునివ్వలేదని, మణిపూర్ కు ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మే 3న మణిపూర్ లో హింస మొదలైంది. ఆ తర్వాత నెలకు కేంద్ర హోంమంత్రిని రాష్ట్రానికి పంపారు. ఆయన వెళ్లొచ్చిన తర్వాత కూడా హింస కొనసాగుతోంది” అని ఖర్గే శనివారం ట్వీట్ చేశారు.