గిరిజన ఆశ్రమ స్కూళ్లలో కార్పొరేట్ సౌలత్ లు .. రూ.11.78 కోట్ల నిధులు కేటాయించిన ప్రభుత్వం

గిరిజన ఆశ్రమ స్కూళ్లలో కార్పొరేట్ సౌలత్ లు .. రూ.11.78 కోట్ల నిధులు కేటాయించిన ప్రభుత్వం
  • వాటర్​ప్లాంట్లు, వాటర్​ హీటర్ల ఏర్పాటుకు చర్యలు
  • రిపేర్లతో మెరుగుపడనున్న గిరిజన స్కూళ్ల పరిస్థితులు
  • పనులు ప్రారంభించిన ఐటీడీఏ అధికారులు

ఆసిఫాబాద్, వెలుగు: గిరిజన విద్యాభివృద్ధికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. దీంతో ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కష్టాలు తీరనున్నాయ్. సరైన తాగునీరు, టాయిలెట్లు, స్నానాల గదులు లేక స్టూడెంట్లకు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం.. ఆ పరిస్థితిని మార్చేందుకు శ్రీకారం చుట్టింది. స్టూడెంట్లకు ఫిల్టర్ వాటర్ అందించేందుకు ప్రత్యేక మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. వాటర్ ట్యాంకుల రిపేర్లు, చలికాలం స్నానాలకు వాటర్ హీటర్లు, విద్యుత్ సప్లై, టాయిలెట్స్, బాత్‌రూంల రిపేర్లతోపాటు అదనంగా మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టింది. నిధులు కేటాయించింది.

133 స్కూళ్లలో 34,304 మంది స్టూడెంట్స్

ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలో ఉన్న మొత్తం 133 ఆశ్రమ పాఠశాలల్లో 34,304 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ స్కూళ్లలో సమస్యలపై ప్రతి ఏటా అధికారులు ఉన్నతాధికారులకు నివేదికలు పంపినా.. నిధులు మాత్రం మంజూరు కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన స్కూళ్లపై సీరియస్ గా దృష్టి పెట్టింది. స్కూళ్లలో కార్పొరేట్ స్థాయి సౌలత్ లు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కనీస సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో రూ.11.78 కోట్ల గిరిజన సంక్షేమ శాఖ నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. వాటర్​ప్లాంట్లు, వాటర్​ హీటర్ల ఏర్పాటు, రిపేర్లు, ఇతర సౌకర్యాలను ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం ద్వారా పూర్తి చేయనుంది.

సమస్యాత్మక స్కూళ్లకు ఫస్ట్ ప్రియారిటీ

విద్యార్థులు ఎక్కువ ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. జైనూర్ మండలంలోని మార్లవాయి గిరిజన ఆశ్రమ స్కూల్​లో ఓపెన్ బావిలోని నీరు తాగుతున్నారని గుర్తించి అక్కడ మినరల్ వాటర్ ప్లాంట్​ను రిపేర్ చేసి ప్రస్తుతం ఫిల్టర్ వాటర్ అందిస్తున్నారు. టాయిలెట్, బాత్ రూంలకు రిపేర్లు చేస్తున్నారు. ఎక్కువ సమస్యలున్న స్కూళ్లను ముందుగా ఎంపిక చేసి దశలవారీగా పనులు చేస్తున్నారు. సౌకర్యాల కల్పనతో గిరిజన విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుందని, భవిష్యత్​లో మంచి 
ఫలితాలు సాధిస్తారని గిరిజన విద్యాశాఖ అధికా రులు భావిస్తున్నారు.

ఓపెన్​ బావి నీరు తాగేవాళ్లం మొన్నటివరకు 

మా హాస్టల్ స్టూడెంట్లమంతా ఓపెన్ బావి నీళ్లు తాగేవాళ్లం. కలుషిత నీటితో అనారోగ్య సమస్యలు ఎదురయ్యేవి. ఇప్పుడు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఫిల్టర్ వాటర్ తాగుతున్నాం. మా నీటి సమస్య తీరింది.  - కుడ్మెత రాజేందర్, టెన్త్​ స్టూడెంట్, మార్లవాయి

జిల్లా  ఆశ్రమ స్కూళ్లు స్టూడెంట్లు     మంజూరైన నిధులు 

ఆదిలాబాద్    54    17,337    రూ.4.43 కోట్లు
ఆసిఫాబాద్    46    9,855    రూ.3.64 కోట్లు
మంచిర్యాల    16    2,788    రూ.2.36 కోట్లు
నిర్మల్    17    4,324    రూ.1.35 కోట్లు