యూఏఈ లో ఉన్న ఇండియన్స్ తీసుకొచ్చేందుకు చర్యలు

యూఏఈ లో ఉన్న ఇండియన్స్ తీసుకొచ్చేందుకు చర్యలు

న్యూఢిల్లీ : లాక్ డౌన్ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు స్వస్థలాలకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం…ఇక విదేశాల్లోని మన వారిని తీసుకురావటం పై దృష్టి పెట్టింది. యూఏఈ లో ఉన్న ఇండియన్స్ లో దేశానికి తిరిగి వచ్చేందుకు రెడీగా ఉన్న వారిని తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అక్కడి రాయబార కార్యాలయాలు రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టాయి. మన దేశానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వారు ముందుగా పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసి వీరిని ఇండియాకు తీసుకురానున్నారు. ఉపాధి కోసం మన దేశం నుంచి యూఏఈకి వెళ్లిన వారు లక్షల్లో ఉన్నారు. కరోనా ఎఫెక్ట్ తో వారికి పనులు లేక తినటానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. తిరిగి ఇండియాకు వెళ్తామంటూ చాలా మంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి యూఏఈ లో ఉన్న వారిని మాత్రమే తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభించారు.