
- ఇంకా టెన్త్ రిజల్టే రాలే...అయినా అడ్మిషన్లు, క్లాసులు
- ఇంటర్ కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల ఇష్టారాజ్యం
- బ్రిడ్జి కోర్సు, ఫౌండేషన్ కోర్సుల పేరుతో క్లాసులు
- బోర్డు గుర్తింపు ఇయ్యకున్నా జోరుగా అడ్మిషన్లు
- అడ్మిషన్లు ఫుల్ అయ్యాయంటూ బోర్డులూ ఏర్పాటు
- ఇంత జరుగుతున్నా పట్టించుకోని ఇంటర్ బోర్డు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కార్పొరేట్ జూనియర్ కాలేజీల ఇష్టారాజ్యం నడుస్తున్నది. ఇంటర్ బోర్డు ఇంకా అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవ్వనేలేదు.. టెన్త్ రిజల్ట్స్ కూడా రాలేదు.. కానీ, పలు కాలేజీల్లో అడ్మిషన్లు అయిపోయాయనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. సర్కారు సెలవులు ఇచ్చినా.. అవేవీ పట్టించుకోకుండా యథేచ్ఛగా క్లాసులు నిర్వహిస్తున్నాయి. వాటిని అడ్డుకోవాల్సిన ఇంటర్ బోర్డు తనకేమీ పట్టనట్లుగానే ఉంది. మార్చి15 నుంచి 29 దాకా ఇంటర్ ప్రధాన పరీక్షలు పూర్తయ్యాయి. ఏప్రిల్ 1 నుంచి మే 31 దాకా కాలేజీలకు ఇంటర్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఏ పేరుతోనూ కాలేజీల్లో క్లాసులు నిర్వహించొద్దని, కాదని నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
కానీ ఇంటర్ బోర్డు ఆదేశాలను కార్పొరేట్ కాలేజీలు లెక్కచేయలేదు. హైదరాబాద్ సిటీతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఫౌండేషన్ కోర్సు, బ్రిడ్జి కోర్సు, జేఈఈ–ఎంసెట్, నీట్ కోచింగ్ పేర్లతో క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఈనెల 11న టెన్త్ మెయిన్ ఎగ్జామ్స్ పూర్తి కాగా.. ఆ వెంటనే కార్పొరేట్ కాలేజీలు, అకాడమీలు ఫస్టియర్ క్లాసులు షురూ చేశాయి. సెకండియర్ క్లాసులనూ కొన్ని కాలేజీల్లో మొదలుపెట్టడం గమనార్హం. వీటి గురించి ఇంటర్ బోర్డు అధికారుల దృష్టికి విద్యార్థి సంఘాలు తీసుకుపోయినా.. పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
టెన్త్ రిజల్ట్ రాకముందే.. అడ్మిషన్లు పూర్తి
రాష్ట్రంలో 1,500 దాకా ఇంటర్ ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలున్నాయి. కార్పొరేట్ కాలేజీల్లో దాదాపు అడ్మిషన్లు పూర్తయ్యాయి. ఇంటర్ విత్ జేఈఈ, ఇంటర్ విత్ నీట్, ఇంటర్ విత్ సివిల్స్ ఇలా వేర్వేరు పేర్లతో అడ్మిషన్లు తీసుకున్నారు. ఆయా కోర్సును బట్టి డే స్కాలర్స్‌కే రూ.లక్షన్నర నుంచి రూ.3 లక్షల దాకా ఫీజులు వసూలు చేస్తున్నారు. కాలేజీల్లో అడ్మిషన్ పొందిన పది రోజుల్లోనే సగం ఫీజు చెల్లించాలని మేనేజ్‌మెంట్లు స్పష్టం చేస్తున్నాయి. సీట్లు అయిపోతాయని భయపెడ్తుండటంతో చేసేదేం లేక పేరెంట్స్ ఫీజులు చెల్లిస్తున్నారు. వారం రోజుల కిందనే టెన్త్ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం స్పాట్ వాల్యుయేషన్ జరుగుతోంది. మే రెండోవారంలో ఫలితాలు వచ్చే అవకాశముంది. కానీ మేనేజ్‌మెంట్లు మాత్రం అడ్మిషన్లు ఫుల్ అంటూ బోర్డులు పెడుతున్నాయి.
కాలేజీలకు గుర్తింపు కూడా ఇవ్వలె
ప్రస్తుతం ప్రైవేటు కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియ నడుస్తోంది. ఏప్రిల్ నెలాఖరులోగా గుర్తింపున్న కాలేజీల లిస్టు ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు గతంలోనే ప్రకటించింది. కానీ గుర్తింపుతో సంబంధం లేకుండానే కార్పొరేట్ కాలేజీలు అడ్మిషన్లు కొనసాగిస్తున్నాయి. క్లాసులు నడిపిస్తున్నాయి. రూల్స్ పాటించకపోతే కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని ఇటీవల హెచ్చరించిన ఇంటర్ బోర్డు, విద్యాశాఖ అధికారులు.. ప్రస్తుతం ఈ విషయాన్ని మరిచిపోయారు. ఇంటర్ బోర్డు నుంచి గుర్తింపు లేకుండానే కాలేజీలు అడ్మిషన్లు చేస్తున్నా.. క్లాసులు నిర్వహిస్తున్నా పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంటర్ బోర్డు, ఉన్నతాధికారులు స్పందించి ప్రత్యేక టీమ్‌ల ద్వారా తనిఖీలు చేయించాలని, క్లాసులు నిర్వహిస్తున్న కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్టూడెంట్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.