చోరికి గురైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారు వారణాసిలో దొరికింది. కారును ఎత్తుకెళ్లిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫరిదాబాద్ సమీపంలోని బధ్కల్ కు చెందిన షాహిద్, షివంగ్ త్రిపాఠి ఆ కారును వారణాసికి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. కారు నంబర్ ప్లేట్ ను మార్చి.. అనంతరం అలీగఢ్, లఖింపూర్ ఖేరి, బరేలీ, సీతాపూర్, లక్నో మీదుగా వారణాసికి తీసుకువచ్చారని పేర్కొన్నారు.
కారును నాగాలాండ్ కు తరలించేందుకు నిందితులు ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. నడ్డా భార్య మళ్లికాకు చెందిన ఫార్చునర్ కారును మార్చి 19న నడ్డా డ్రైవర్ సర్వీస్ సెంటర్లో ఉంచి, భోజనం కోసం బయటకు వెళ్లగా నిందితులు దానిని దొంగిలించారు. డ్రైవర్ జోగిందర్ సింగ్ ఫిర్యాదు మేరకు గోవింద్‌పురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. సీసీ పుటేజీల ఆధారంగా విచారణ చేపట్టి నిందితులను పట్టుకున్నారు. ఈ కారును కనుగొనడానికి స్పెషల్ టీమ్ 15 రోజుల్లో 9 నగరాల్లో సెర్చ్ చేసింది. కారు చోరీకి గురైందని ఎవరికీ అనుమానం రాకూడదని షాహిద్ తన భార్య, పిల్లలను తీసుకుని ఫరీదాబాద్‌కు వెళ్లాడు.