చోరీ సొత్తు దొరకట్లేదు!.. మూడేండ్లలో రూ.393.3 కోట్లు కోల్పోయిన బాధితులు

చోరీ సొత్తు దొరకట్లేదు!.. మూడేండ్లలో రూ.393.3 కోట్లు కోల్పోయిన బాధితులు
  • ఇందులో 50 శాతం మాత్రమే రికవరీ
  • నేషనల్ క్రైమ్‌‌‌‌ రికార్డ్స్‌‌‌‌ బ్యూరో రిపోర్ట్

హైదరాబాద్‌‌‌‌,వెలుగు : దోపిడీలు, దొంగతనాల్లో దుండగులు ఎత్తుకెళ్లిన సొత్తు రికవరీ కావడం లేదు. వందల కోట్లలో సొమ్ము మాయం అవుతున్నా రికవరీ చేయడంలో పోలీసులు ఫెయిల్​ అవుతున్నారు. గత మూడేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నేరాల్లో రూ.393.3 కోట్లు విలువైన సొత్తును బాధితులు కోల్పోయారు. ఇందులో రూ.208.3 కోట్లు మాత్రమే రికవరీ అయింది. ఈ విషయం నేషనల్ క్రైమ్‌‌‌‌ రికార్డ్స్‌‌‌‌ బ్యూరో–2022 రిపోర్టులో  వెల్లడైంది. ఏటా నమోదయ్యే  కేసుల్లో  కేవలం 50 శాతం మాత్రమే రికవరీ అవుతున్నట్లు పేర్కొంది.

రాష్ట్రంలో రూ.162.9 కోట్లు లూటీ

గతేడాది దేశవ్యాప్తంగా జరిగిన చోరీలు, దోపిడీ తదితర ప్రాపర్టీ కేసుల్లో రూ.5,223.3 కోట్లను బాధితులు కోల్పోయారు. ఇందులో పోలీసులు రూ.1882.5 కోట్లు మాత్రమే రాబట్టారు. దీని రేట్‌‌‌‌ 36 శాతంగా ఉంది. మన రాష్ట్రంలో162.9కోట్లు విలువైన ప్రాపర్టీ నష్టం వాటిల్లితే.. రూ.84.9 కోట్లే రికవరీ చేశారు. ఇది 52.1 శాతంగా ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా గతేడాది రూ.941.5 కోట్లు విలువైన ప్రాపర్టీ కోల్పోగా,  కేవలం 31శాతం అంటే 298.8 కోట్లు మాత్రమే రాబట్టగలిగారు. మిగతా సొత్తును గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారు.

దొంగలు దొరికినా..

రాష్ట్రంలో నమోదయ్యే కేసుల్లో తీవ్రమైన నేరాలు మినహా తక్కువ మొత్తంలో జరిగిన క్యాష్‌‌‌‌, బంగారం కేసులను పోలీసులు పట్టించుకోవడం లేదు. చోరీ కేసుల దర్యాప్తు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ టీవీ ఫుటేజ్‌‌‌‌లు, ఫింగర్‌‌‌‌‌‌‌‌ ప్రింట్స్ దొరికినా.. దొంగలను పట్టుకోవడంలో లేట్ చేస్తున్నారు. అంతర్రాష్ట్ర ముఠాలను గుర్తించడం, వారిని ట్రేస్ చేయడంలోనూ జాప్యం జరుగుతోంది. ఇదే చాలా మంది దొంగలకు అవకాశంగా మారుతుంది.  పోలీసులు పట్టుకునే లోగా దొంగలు దోచిన డబ్బు, బంగారాన్ని రికవరీ కాకుండా చేసేస్తున్నారు. ఇతరుల పేర్లతో ఆస్తులు కొనుగోలు చేయడం, డబ్బులు ఖర్చు చేయడంతో వసూలు చేయడంలో సవాల్‌‌‌‌గా మారింది.