Viral Video: రెండేళ్ల చిన్నారిపై వీధి కుక్క దాడి..తండ్రి అక్కడ లేకుంటే పరిస్థితి దారుణంగా ఉండేది

Viral Video: రెండేళ్ల చిన్నారిపై వీధి కుక్క దాడి..తండ్రి అక్కడ లేకుంటే పరిస్థితి దారుణంగా ఉండేది

వీధికుక్కల బెడద రోజురోజుకు పెరిగిపోతోంది..ముఖ్యంగా చిన్న పిల్లలపై కుక్కల దాడులు మరింత పెరిగాయి. ఇటీవల హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీధికుక్కల దాడులు చాలా జరిగాయి. తాజాగా గుజరాత్ లో ఓ చిన్నారిపై వీధి కుక్క దాడి సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆడుకుంటున్న చిన్నారిపై కుక్క దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన ఈ దృశ్యాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. 

వైరల్ అవుతున్న వీడియోలో..ఒక ఇంటి ఆవరణలో పిల్లవాడు ఆడుకుంటుండగా ఓ వీధికుక్క హఠాత్తుగా బాలుడిపై దాడి చేయడం కనిపిస్తుంది. బాలుడిని నోటిలో కర్చుకొని వెళ్తోంది. బాలుడు గట్టిగా ఏడుస్తున్న అరుపులు వినిపిస్తున్నాయి. బాలుడి అరుపులు విన్న  తండ్రి వెంటనే స్పందించి కుక్కను తరిమేసి తన బిడ్డను రక్షించాడు. తండ్రి సకాలంలో అక్కడకు రాకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. వెంటనే ఆ చిన్నారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం బాలుడు క్షేమంగా ఉన్నాడు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నివాస ప్రాంతాల్లో వీధికుక్కల వలన ఎదురవుతున్న ప్రమాదాలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధికుక్కల సంఖ్యను నియంత్రించేందుకు, పిల్లల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ప్రజలు కోరుతున్నారు.