వేసవి సెలవులు పిల్లలకు హైదరాబాద్ చూపిద్దామని చుట్టాల ఇంటికి వచ్చారు. కుటుంబ సభ్యులు అందరూ కబుర్లతో సంతోషంగా గడుపుతుండగా.. చిన్నారి ఆడుకుందామని బయటకు వచ్చింది. అంతే సంగతులు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 వీధి కుక్కలు మీద పడి దాడి చేశాయి. 2026 మే 11న సాయాంత్రం జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారి పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది.
వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట నుంచి వేసవి సెలవుల కోసం మీర్ పేటలోని టీచర్స్ కాలనీలో తన పిన్ని ఇంటికి వచ్చిన అద్విక్ అనే చిన్నారి వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు రాత్రి 7:30 నుండి 8:00 గంటల మధ్య ఇంటి సెల్లార్ ప్రాంతంలో ఆడుకుంటుండగా కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అవసరమైన కొన్ని మందులు అందుబాటులో లేకపోవడంతో, అత్యవసరంగా నారాయణగూడ నుంచి మందులు తెప్పించినట్లు సమాచారం. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు నిరంతర పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.
వేసవి సెలవుల ఆనందం కోసం వచ్చిన చిన్నారి ఇలా దారుణ ఘటనకు గురికావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వీధి కుక్కల నియంత్రణపై సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ స్థానికులు చేస్తున్నారు.
