
ఢిల్లీ.. దేశ రాజధాని. పొలిటికల్, సెంట్రల్ గవర్నమెంట్ పెద్దలంతా అక్కడే ఉంటారు. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పీఎం, సీఎం, మినిస్టర్లు, ఎంపీలు తదితర వీవీవీఐపీలు అందరూ ఆ నగరంలో దేశ పాలనా వ్యవహారాల్లో బిజీబిజీగా గడుపుతుంటారు. రాష్ట్రపతి భవన్, పార్లమెంట్, సుప్రీంకోర్టు, ఇండియా గేట్, రెడ్ ఫోర్ట్ ఇలా ఎన్నో ముఖ్య ప్రదేశాలకు ఢిల్లీయే నిలయం. అక్కడ సెక్యూరిటీ హై రేంజ్లో కట్టుదిట్టంగా ఉంటుంది. చీమ చిటుక్కుమన్నా పోలీసులు క్షణాల్లో పట్టేస్తారని ఆశిస్తాం. అంత స్ట్రాంగ్ సెక్యూరిటీ ఉన్నచోట ఇటీవలి గ్యాంగ్‌స్టర్ల ఫైరింగ్‌లు, స్ట్రీట్ ఫైట్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి.
దేశమంంతా ఎన్నికల హడావుడిలో ఉన్న సమయంలో క్యాపిటల్ సిటీ ఢిల్లీ స్ట్రీట్ ఫైటింగ్‌లు, గ్యాంగ్‌స్టర్ల కాల్పులతో గజగజలాడింది. గడిచిన నెల రోజుల్లో మొత్తం 43 గన్ ఫైరింగ్ ఇన్సిడెంట్లు చోటుచేసుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో పోలీసులు 220 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. మే 17 నుంచి జూన్ 15 వరకు జరిగిన ఈ కాల్పుల్లో 16 మంది ప్రాణాలు కోల్పోపోయారు. 22 మంది గాయపడ్డారు. తుపాకులతో కాకుండా కత్తులతో, ఇతర వెపన్లతోకూడా దాడులకు తెగబడ్డ ఘటనలు వీటికి అదనం. సిటీ బయటి ప్రాంతాల కన్నా సెంట్రల్, సౌత్, వెస్ట్ ఢిల్లీల్లో ఈ బుల్లెట్ల షూటింగ్‌లు ఒకేసారి వెలుగుచూడటంపై పోలీసు పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సిటీ అంతా ఇదే పరిస్థితి
గన్ షాట్లు సిటీలోని అన్ని ఏరియాల్లోనూ జరిగాయి. సౌత్‌లోని బారాపుల్లా ఫ్లైఓవర్ నుంచి సెంట్రల్ ఢిల్లీలోని కరోల్‌బాగ్ వరకు; వెస్ట్‌లోని ద్వారకా నుంచి ఈస్ట్‌లోని కల్యాణ్‌పురి వరకు గూండాలు ఢిష్యూం ఢిష్యూంలకు దిగారు. ఒకరిపై ఒకరు తుపాకులు ఎక్కుపెట్టుకున్నారు. కాల్పుల్లో చనిపోయినవారిలో గ్యాంగ్స్టర్లు, సోషల్ మీడియా స్టార్లు, ప్రాపర్టీ డీలర్లు, జ్యూయెలర్లు, హోటల్స్ వర్గాలు, జర్నలిస్టులు, బిజినెస్మెన్లు ఉన్నారు. ప్రతి కేసులోనూ ఇల్లీగల్ పిస్టళ్లనే వాడినట్లు తేలింది. తొమ్మిది కేసుల్లో పోలీసులు క్రిమినల్స్‌ని ఎన్కౌంటర్లు చేశారు. వీటి కోసం 32 బుల్లెట్లు వాడారు.
పోటీదార్ల మధ్య, పాత గ్యాంగ్‌ల్లోని ప్రత్యర్థుల మధ్య, వ్యక్తిగత కక్షలు, దొంగతనాలకు పాల్పడటం, స్నాచింగ్, దోపిడీ యత్నాలు, పోలీస్ షౌట్ అవుట్లు వంటి కారణాల వల్ల ఈ గొడవలు జరుగుతున్నాయి. బజార్లు, ఆఫీసులు, రెస్టారెంట్లు, షాపులు తదితర ప్రాంతాల్లో ఇవి జరుగుతున్నాయి. ఈ ఏడాది మినహా గతంలో ఇలాంటివి ఎన్ని జరిగాయనే డేటా పోలీసుల వద్ద లేదు. గూండాల కాల్పుల ఘటనలకు సంబంధించి సిటీ వైడ్ రికార్డ్‌ను పోలీసులు మెయింటైన్ చేయలేదు. స్టేషన్ల వారీగా మాత్రమే నేరాలను నమోదు చేశారు. సెటిల్మెంట్లు, దందాలను క్రిమినల్స్ పట్టపగలే, నడి రోడ్ల పైనే చేస్తున్నారని సీనియర్ పోలీస్ ఆఫీసర్లు పలువురు అంటున్నారు. తాము అనుకున్నది సాధించుకోవటానికి నేరగాళ్లు ఓపెన్‌గానే బాధితుల తలకు గన్ను గురిపెట్టి చంపుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారని, దేశ రాజధానిలో ఇలాంటి పరిస్థితి నెలకొనటం చింతించాల్సిన విషయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు నెలల్లో 15 ఎన్కౌంటర్లు
‘నేరగాళ్లు రాన్రానూ మొండిగా తయారవుతున్నారు. ఈమధ్య అరెస్టయినవాళ్లలో హార్డ్‌కోర్ గ్యాంగ్స్టర్లు పెద్దగా లేరు. కానీ చోటా క్రిమినల్స్ కూడా ఇటీవల పోలీసులంటే భయం గానీ, కోర్టుల్లో శిక్షలు పడతాయనే ఆలోచన గానీ లేకుండా వీధుల్లోకి వచ్చి శత్రువులపై విచ్చలవిడిగా ఫైరింగ్ చేస్తున్నారు. రీసెంట్గా ఈ రెండు నెలల్లో 10–15 పోలీస్ ఎన్కౌంటర్లు జరిగాయి. ఇందులో ఎక్కువ మంది తొలిసారి నేరానికి పాల్పడ్డవారే కావటం గమనార్హం’ అని ఓ అధికారి అన్నారు.
ఆఫీసర్లూ.. గస్తీలో పాల్గొనండి
ఢిల్లీలో ఫైరింగ్‌లు పెరుగుతుండటంతో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ 10 రోజుల కిందట మీటింగ్ పెట్టారు. సీనియర్ పోలీసు అధికారులు ఆఫీసుల నుంచి బయటకొచ్చి రోడ్లపై రాత్రీ పగలూ గస్తీ తిరగాలని ఆదేశించారు. దీనిపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. క్యాపిటల్‌లోని ‘లా అండ్ ఆర్డర్’ను చక్కదిద్దాలని కేంద్రాన్ని, ఎల్జీని కోరారు. క్రైమ్ రేట్‌ను తగ్గించటానికి తీసుకోవాల్సిన చర్యలపై ఢిల్లీ పోలీస్ చీఫ్ అమూల్య పట్నాయక్ పెద్దాఫీసర్లతో చర్చించారు. ఇవి ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి.