జిల్లా న్యాయవ్యవస్థను పటిష్టం చేయడం ఎంతో అవసరం

జిల్లా న్యాయవ్యవస్థను పటిష్టం చేయడం ఎంతో అవసరం

జిల్లా న్యాయవ్యవస్థను పటిష్టం చేయడం ఎంతో అవసరమని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. న్యాయాన్ని ప్రజల ఇంటి గడపకు చేర్చేలా న్యాయవ్యవస్థను పటిష్ఠం చేయాలన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జిల్లా న్యాయ సేవల అధికారుల మొట్టమొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీజేఐ ఎన్వీ రమణ, ప్రధాని మోడీ సహా పలువురు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ..‘‘ప్రజలకు అతిదగ్గరగా ఉండేది జిల్లా న్యాయ సేవల అధికారులే. న్యాయవ్యవస్థపై ప్రజల అభిప్రాయం జిల్లా న్యాయ సేవల అధికారుల నుంచి ప్రజలకు ఎదురయ్యే అనుభవాలను బట్టి ఉంటుంది’’ అని  అన్నారు. అదేవిధంగా ఈ దేశ నిజమైన బలం యువతలోనే ఉందన్నారు. ప్రపంచంలోని ఐదో వంతు యువత మన దేశంలోనే ఉందని చెప్పారు. అయితే నైపుణ్యం కలిగిన వారు శ్రామిక శక్తిలో 3 శాతం మాత్రమే అని..మిగితావారిలో కూడా ఆ శక్తిని పెంచి ఉపయోగించుకోవాలని సూచించారు.  

న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల కల్పనకు వేగంగా పనులు

గత 8 ఏళ్లలో న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల కల్పనకు పనులు వేగంగా జరిగాయని ప్రధాని మోడీ తెలిపారు. ఈ కోర్టు మిషన్ లో భాగంగా వర్చువల్ కోర్టులను ప్రారంభించినట్లు తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనల వంటి నేరాల కోసం 24 గంటలు కోర్టులు పనిచేస్తున్నట్లు చెప్పారు. సులభతర వాణిజ్యం, సులభతర జీవనంలాగే సులభతర న్యాయం కూడా అంతే ముఖ్యమని అన్నారు. రాబోయే 25ఏళ్లలో  దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే తీర్మానాలకు ఇది మంచి సమయమన్నారు.