బంగ్లాదేశ్​తో బంధం బలోపేతం : సీనియర్ జర్నలిస్ట్ మల్లంపల్లి ధూర్జటి

బంగ్లాదేశ్​తో బంధం బలోపేతం : సీనియర్ జర్నలిస్ట్ మల్లంపల్లి ధూర్జటి

త్రిపురలోని అగర్తల, బంగ్లాదేశ్ లోని అఖౌరాల మధ్య సుమారు 13 కిలోమీటర్ల నిడివి కలిగిన రైలు మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇటీవల ప్రారంభించారు. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలను పటిష్టపరచడంలో ఇది మరో మైలురాయి కానుంది. అగర్తల–- అఖౌరా ప్రాజెక్టు వల్ల ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం 31 గంటల నుంచి 10 గంటలకు తగ్గనుంది. ఈ ప్రాజెక్టు భారత్- బంగ్లాల మధ్య టూరిజం, వర్తకంతో పాటు ప్రజల మధ్య సంబంధాలు పెంపొందడానికి తోడ్పడనుంది.  

త్రిపురలో 6 కిలోమీటర్ల  రైలు మార్గం బంగ్లాదేశ్ వైపు 7 కిలోమీటర్ల రైలు మార్గ నిర్మాణం పూర్తయింది. బంగ్లాదేశ్ లోని బ్రహ్మన్ బారియా జిల్లాలో అఖౌరా ఉప జిల్లా కిందకు వస్తుంది. అగర్తలలో బయలుదేరిన రైలు భారత్–​-బంగ్లా సరిహద్దులోని నిశ్చింతపూర్ చేరుకుంటుంది. అక్కడ ఇమిగ్రేషన్ తాలూకు లాంఛనాలు పూర్తవుతాయి. బంగ్లాదేశ్ వైపు మొదటి స్టేషన్ గంగాసాగర్ అవుతుంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా గూడ్సు బండిని నడిపి పరీక్షించారు. మున్ముందు ప్రయాణికుల రాకపోకలకు వీలుంటుంది.

రైల్వే లైన్లు భారత్​ సహకారమే

రెండు దేశాల్లోనూ ఏయే పార్టీలు అధికారంలో ఉన్నా ఇరు దేశాల స్నేహ సంబంధాలు మాత్రం సవ్యంగా ఇలాగే కొనసాగితే అగర్తల, -చిట్టగాంగ్ మధ్య కూడా రైలు సదుపాయం ఏర్పడవచ్చు. అఖౌరా ప్రాజెక్టుకు మొత్తం (సుమారు రూ.1255 కోట్లను) నిధులను భారతదేశమే సమకూర్చింది. భారత్ వైపు పనులకు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిధులు సమకూరిస్తే,  బంగ్లాదేశ్ వైపు పనులకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ‘బంగ్లాదేశ్ కు సహాయం’ కింద సమకూర్చింది. నిజానికి ఈ ప్రాజెక్టు 2020 నాటికే పూర్తికావలసి ఉంది. కానీ, భూ సేకరణలో సమస్యలు (భారతదేశం వైపు దాదాపు 87 ఎకరాలు సేకరించారు),  కొవిడ్ మహమ్మారి కారణంగా జాప్యమైంది. భారత్ వైపు నిర్మాణ పనులను ఇండియన్ రైల్వే కన్ స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్  పూర్తి చేస్తే, బంగ్లాదేశ్ వైపు పనులను టెక్స్ మ్యాకో అనే భారతీయ ప్రైవేటు సంస్థ  నిర్వహించింది. అగర్తల–-అఖౌరాలను కలపడం వల్ల  వీటి మధ్య దూరం 1600 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్లకు తగ్గిపోతుందని త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా కూడా హర్షం వ్యక్తం చేశారు.

పాక్ శరణార్థులకు త్రిపుర ఆశ్రయం

త్రిపురకు సుమారు 856 కిలోమీటర్ల నిడివి కలిగిన అంతర్జాతీయ సరిహద్దు ఉంది. పశ్చిమ బెంగాల్ తర్వాత బంగ్లాదేశ్ తో  త్రిపుర ఎక్కువ సరిహద్దును పంచుకుంటోంది. త్రిపురకు ఒకపక్క అస్సాం ఉంటే, మూడుపక్కల బంగ్లాదేశ్ ఉంది. ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్ గా ఉన్న నేటి బంగ్లాదేశ్ లో షేక్ ముజిబుర్ రహమాన్ విముక్త పోరాటం సాగించారు. దానికి భారత్ మద్దతు ఇవ్వడంతో భారతదేశం, -పాకిస్తాన్ మధ్య 1971లో యుద్ధం కూడా చోటు చేసుకుంది. ఆ సమయంలో ఇంచుమించుగా 15 లక్షల మంది తూర్పు పాకిస్తానీ శరణార్థులకు త్రిపుర ఆశ్రయం ఇచ్చింది.

బంగ్లా పార్లమెంటులో మహిళలకు 50 సీట్లు రిజర్వు

బంగ్లాదేశ్ పార్లమెంట్ ను జాతీయో సంగ్సద్ అంటారు. మొత్తం 350 సీట్లు కలిగిన సంసద్ లో 50 సీట్లను మహిళలకు రిజర్వు చేశారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడిని లేదా అధ్యక్షురాలిని ఈ సంసద్ సభ్యులే ఎన్నుకుంటారు. మన దేశంలోలాగానే ఐదేండ్లకొకసారి ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు 300 సీట్లకు నిర్వహిస్తారు. వివిధ పార్టీలకు పోలయిన ఓట్ల దామాషాను బట్టి ఆయా పార్టీలు 50 మంది మహిళా సభ్యులను ఎంచుకుంటాయి. జాతీయ రాజకీయాలను షేక్ హసీనా, బీఎన్పీ నాయకురాలు బేగం ఖలీదా జియా చాలా కాలంగా నడుపుతూ వస్తున్నప్పటికీ, స్థానిక సంస్థలలో మహిళా ప్రాతినిధ్యం తక్కువగానే ఉంది. ఖలీదా జియా భర్త జియావుర్ రహమాన్ బంగ్లాదేశ్ అధ్యక్షుడుగా పనిచేశారు.  బీఎన్పీ స్థాపకుడైన జియావుర్ రహమాన్ 1977లో హత్యకు గురయ్యారు.

భారత్‑బంగ్లా మధ్య మరో మూడు రైళ్లు

భారత్ నుంచి బంగ్లాదేశ్ వెళ్ళేందుకు అగర్తల–అఖౌరా రైలు మార్గం ఒక్కటే  కాదు. పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ వెళ్లేందుకు బంధన్ ఎక్స్ ప్రెస్, మైత్రీ ఎక్స్ ప్రెస్, మిటాలీ ఎక్స్ ప్రెస్ అనే మరో మూడు రైళ్ళు ఉన్నాయి. బంధన్ ఎక్స్ ప్రెస్ బంగ్లాదేశ్ లో మూడవ పెద్ద నగరమైన ఖుల్నాకు కోల్ కతా నుంచి నడుస్తుంది. ఈ రెండు నగరాల మధ్య ఒకప్పుడు బరిశాల్ ఎక్స్ ప్రెస్ నడిచేది. భారత్, -పాకిస్తాన్ ల మధ్య 1965 యుద్ధం తర్వాత అది నిలిచిపోయింది. కోల్ కతా–-ఖుల్నాల మధ్య రైలు సదుపాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, -హసీనాల ప్రభుత్వాలు 2017లో పునరుద్ధరించాయి. కోల్ కతా నుంచి ఢాకా కంటోన్మెంట్​కు  మైత్రీ ఎక్స్ ప్రెస్ 2008 ఏప్రిల్​లో  మొదలైంది. బెంగాల్ ఉత్తర ప్రాంతంలోని సిలిగుడి నుంచి ఢాకాకి మిటాలీ ఎక్స్ ప్రెస్ 2021 మార్చిలో ప్రారంభమైంది.

జనవరిలో బంగ్లాదేశ్​ ఎన్నికలు

ప్రస్తుతం బంగ్లాదేశ్​లో  షేక్ హసీనా నేతృ త్వంలోని అవామీ లీగ్ పార్టీ అధికారంలో ఉంది. వచ్చే జనవరిలో బంగ్లాదేశ్​లో ఎన్ని కలు జరగనున్నాయి. నిష్పక్షపాత, ఆపద్ధర్మ ప్రభుత్వ ఆధ్యర్యంలో ఈ ఎన్నికలు జరగాల ని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ), ఇతర ప్రతిపక్షాలు కోరుతున్నాయి. విచిత్రంగా అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లు కూడా అదే పల్లవిని అందు కున్నాయి. అమెరికా మరో అడుగు ముందు కు వేసి  ప్రజాస్వామ్య అనుకూల వాతావ రణం ఏర్పాటుకు, స్వేచ్ఛాయుతంగా ఎన్నిక ల నిర్వహణకు అడ్డుపడే కొందరు బంగ్లాదేశ్ అధికారులు, రాజకీయ నాయకులు, సైనికా ధికారులు, జడ్జీలకు వీసాలు నిరాకరిస్తామని కూడా ప్రకటించింది. ఈ బ్లాక్ లిస్ట్​లో సమాచార సాధనాల వారున్నా వింతేమీ లేదని బంగ్లాదేశ్​లో అమెరికా రాయబారి పీటర్ డి. హాస్ కూడా ప్రకటించారు. ఈయూ కూడా త్వరలో ఇదే వైఖరిని అవలంబిస్తుందని ఢాకాలో ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే, హంగరీ, పోలెండ్​ల జాతీయ సార్వభౌమాధికార సమస్యలలో తలమునకలై ఉన్నందు వల్ల, రష్యా- ఉక్రెయిన్​ల మధ్య యుద్ధం తాలూకు సెగలు తగలడం ఇంకా తగ్గనందువల్ల, బంగ్లాదేశ్​లో లేని సమస్యను ఉన్నదని చెబుతూ, మరో కొత్త సమస్యను ఈయూ నెత్తికెక్కించుకోకపోవచ్చు.

బంగ్లాదేశ్​పై అమెరికా రాజకీయం

అమెరికా తమకెక్కడో దూరంగా ఉన్న సార్వభౌమాధికార దేశం బంగ్లాదేశ్ లో రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేయడానికి ట్రావెల్ వీసాలను ఒక సాధనంగా వాడుకోవాలని భావించడం విడ్డూరం. అమెరికా నూతన వీసా విధానం సహజంగానే బీఎన్పీ మద్దతుదారులు, నిబద్ధులైన వామపక్షవాదులు, కరడుగట్టిన ఇస్లామిస్టుల ముఖాలలో ఆనందం నింపింది. యుద్ద నేరాలలో దోషులుగా తేలినవారికి కఠిన శిక్షలు విధించే  షేక్ హసీనా విధానం అమెరికాకు గిట్టడం లేదు. బంగ్లా విముక్తి పోరాట నాయకుడు షేక్ ముజిబుర్ రహమాన్, ఆయన కుటుంబ సభ్యులు 1975 ఆగస్టులో హత్యకు గురయ్యారు. ఆ హత్యోదంతానికి బాధ్యులైనవారికి కఠిన శిక్షలు విధించడం కూడా అమెరికాకు నచ్చలేదు. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధకాలం 1971లో నరమేధాలకు పాల్పడిన ఒక ప్రసిద్ధ ఇస్లామిస్టు నాయకుడికి పడిన ఉరిశిక్షను తగ్గించవలసిందిగా 2013 డిసెంబర్​లో అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఫోన్ చేసి షేక్ హసీనాకు విజ్ఞప్తి చేసిన విషయం పత్రికల్లో కూడా వచ్చింది. ఇపుడు ఎన్నికల నిర్వహణకు సంబంధించి హసీనాను భయపెట్టాలని చూస్తోంది. ఇది మరొక దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడమే అవుతుంది.  ఇటువంటి పరిస్థితుల్లో ఏనాటి నుంచో భారతదేశంతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్న షేక్ హసీనాకు భారత్ ధైర్యంగా అండగా నిలవాలి.  జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భారత్ తో మైత్రి తమకు మేలు చేకూరుస్తుందని బంగ్లాదేశ్ లో మిగిలిన రాజకీయ పార్టీలు కూడా గ్రహించాలి. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ భారత ప్రభుత్వ చేతిలో కీలుబొమ్మ అనే అభిప్రాయం బంగ్లాలోని మిగిలిన రాజకీయ పార్టీల్లో ఉంది. కానీ, అదొక అపోహ మాత్రమే. బంగ్లాదేశ్ అవతరించినప్పటి నుంచి రెండు భిన్న రాజకీయ దృక్ఫథాలను చవిచూస్తోంది. సెక్యులర్ బెంగాలీ జాతీయవాదం వైపు అవామీ లీగ్ నిలుస్తోంది. ఇప్పుడు జమాత్-ఏ- ఇస్లామీతో పొత్తు పెట్టుకున్న బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ముస్లిం బంగ్లాదేశీ జాతీయవాదాన్ని ప్రబోధిస్తోంది.

- మల్లంపల్లి ధూర్జటి,

సీనియర్ జర్నలిస్ట్