
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టీకరణ
ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో ఎక్కడైనా అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తే.. శాంక్షన్ చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ముందుగా సస్పెండ్ చేస్తామని, నిజనిర్దారణ తర్వాత సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తామని చెప్పారు. గురువారం ఖమ్మం కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం భూభారతి, ఇందిరమ్మ ఇండ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. భూభారతి అమలుపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు.
మూడు, నాలుగు దశల్లో క్రాస్ చెక్ చేసిన తర్వాతే అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నామన్నారు. జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి ఇండ్లలో గృహ ప్రవేశాలు చేసేలా స్పీడ్ గా నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 1.95 లక్షల లబ్ధిదారులను గుర్తించామని, మిగిలిన వారిని ఈ నెలాఖరు లోపు ఎంపిక చేస్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు అదనంగా 10 వేల ఇండ్లు ఇస్తామని చెప్పారు. 9,800 చెంచు కుటుంబాలు ఉన్నట్లు గుర్తించామని, వాళ్లందరికీ ఇండ్లు ఇస్తామని ప్రకటించారు.
గత ప్రభుత్వ హయాంలో ధరణి వల్ల ప్రతీ కుటుంబం ఇబ్బంది పడిందని విమర్శించారు. భూభారతి కింద wపైలట్ మండలాలుగా ఎంపిక చేసిన వాటిలో వచ్చిన సమస్యల్లో కోర్టులో ఉన్నవి తప్పించి మిగిలిన వాటిని జూన్ 2లోగా పరిష్కరిస్తామన్నారు. వేర్వేరు డిపార్ట్ మెంట్లకు వెళ్లిన వీఆర్వో, వీఆర్ఏల్లో వెనక్కి వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 27న పరీక్ష పెట్టి, జూన్ 2న వారిని రెవెన్యూ అధికారులుగా పంపిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 413 గ్రామాలకు ఇప్పటి వరకు నక్షాలు, సర్వే రికార్డులు లేవని, వాటిలో ఐదింటిని పైలట్ గ్రామాలుగా ఎంపిక చేసి సర్వే చేయబోతున్నట్లు చెప్పారు. ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు.