అర్ధరాత్రి రోడ్ల మీద బర్త్ డేలు చేస్తే కఠిన చర్యలు : తలసాని

అర్ధరాత్రి రోడ్ల మీద బర్త్ డేలు చేస్తే కఠిన చర్యలు : తలసాని

హైదరాబాద్: అర్ధరాత్రిపూట బర్త్ డే పార్టీల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తున్న యువతపై దృష్టి సారించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోలీసులకు సూచించారు. అమీర్ పేట డివిజన్ లో జరిగిన వివిధ కార్యక్రమాలకు హాజరైన మంత్రి తలసాని ఎస్ఆర్ టీ, ఈడబ్ల్యూఎస్ కాలనీలలో పర్యటించారు. 

ఈ సందర్భంగా అక్కడి స్థానికులు అర్ధరాత్రి వేళ నడిరోడ్డుపై వాహనాలను నిలిపి బర్త్ డే పార్టీలు అంటూ నానా హంగామా సృష్టిస్తున్నారని, ఆ సమయంలో అటుగా వెళుతున్న వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారని మంత్రికి తెలిపారు. బర్త్ డే వేడుకల అనంతరం చిత్తుగా మద్యం సేవించి వాహనాలను అక్కడే పార్క్ చేసి వెళ్లిపోతున్నారని మంత్రికి ఫిర్యాదు చేశారు.

స్థానికుల ఫిర్యాదుపై మంత్రి తలసాని వెంటనే స్పందించారు. పార్టీ పేరుతో ఇతరులను భయభ్రాంతులకు గురిచేస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు.  అవసరమైతే ప్రత్యేక క్రేన్ల సహాయంతో పార్టీ చేసుకుంటున్న వారి వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించి..  చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.