ఎక్కువ ధరకు ఎరువులను అమ్మితే కఠిన చర్యలు : తుమ్మల నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌ రావు

ఎక్కువ ధరకు ఎరువులను అమ్మితే కఠిన చర్యలు : తుమ్మల నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌ రావు
  •     యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌ ఎరువులపై మంత్రి తుమ్మల సమీక్ష
  •     అమ్మకాలపై రాజకీయ జోక్యం ఉండదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రైతులకు ఎక్కువ ధరకు ఎరువులను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌ రావు ఆదేశించారు. రాష్ట్రంలో యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌ కోసం ఎరువుల నిర్వహణపై మంత్రి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎరువుల అమ్మకాల విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదని స్పష్టం చేశారు.

నిబంధనలు పాటించని ఫర్టిలైజర్ కంపెనీలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు కావాల్సిన అన్ని రకాల ఎరువులను ఆయా కంపెనీలతో చర్చించి సిద్ధం చేయాలన్నారు. ఎరువుల పంపిణీలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్క్‌‌‌‌‌‌‌‌ఫెడ్, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. నిజామాబాద్ పర్యటనలో రైతులు ఇచ్చిన వినతి పత్రాలపై సానుకులంగా స్పందిస్తూ.. ప్యాక్స్‌‌‌‌‌‌‌‌లో నిబంధనలకు విరుద్ధంగా రుణాలు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

డీసీసీబీలు, ప్యాక్స్‌‌‌‌‌‌‌‌లకు సంబంధించిన పాత రుణాల బకాయిలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. మొండి బకాయిలు, నాన్ అగ్రికల్చర్ లోన్లు రికవరీ చేసి, వారం రోజుల్లో లోన్లు తీర్చని వారిపై యాక్షన్‌‌‌‌‌‌‌‌ తీసుకోవాలన్నారు. అగ్రికల్చర్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ గోపి మాట్లాడుతూ, ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆగ్రోస్‌‌‌‌‌‌‌‌ ఎండీ కె.రాములు, మార్క్‌‌‌‌‌‌‌‌ఫెడ్ ఎండీ సత్యానారాయణ, టెస్కాబ్‌‌‌‌‌‌‌‌ ఎండీ మురళీధర్‌‌‌‌‌‌‌‌, పలు ఫెర్టిలైజర్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.