టపాసులపై నిషేధం విధించిన ఢిల్లీ ప్రభుత్వం

టపాసులపై నిషేధం విధించిన  ఢిల్లీ ప్రభుత్వం

దీపావళి పండుగ వస్తుందంటే ఢిల్లీ వాసులు వణికిపోతుంటుంటారు. బాణసంచా కాల్చడం వల్ల అధిక శాతం కాలుష్యం పెరిగిపోతుంటుంది. శ్వాసకోశ వ్యాధి గ్రస్తులు, చిన్న పిల్లలు, వృద్ధుల అవస్ధలు వర్ణనాతీతంగా ఉంటాయి. దీంతో గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా టపాసులపై ఢిల్లీ ప్రభుత్వం పూర్తి నిషేధం విధించింది. బాణసంచా తయారీ, నిల్వ, అమ్మకం, కాల్చడంపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. బాణసంచా కొనుగోలు చేసినా, కాల్చినా రూ.200 జరిమానా, 6 నెలల పాటు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పటాకుల అమ్మకం, నిల్వ చేస్తే రూ. 5,000 జరిమానా లేదా 3 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. సాధారణంగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మిగతా నగరాలతో పోలిస్తే అధికంగానే ఉంటుంది. ఈ క్రమంలో.. టపాసులు కాల్చడం వల్ల గాలి నాణ్యత మరింతగా తగ్గుతుందని పర్యావరణ నిపుణులు వెల్లడిస్తున్నారు. దీపావళి పండుగ అనంతరం కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో సుప్రీంకోర్టు 2017లో బాణసంచాపై నిషేధం విధించింది. న్యూఢిల్లీతో సహా.. చుట్టు పక్కల నగరాల్లో టపాసుల విక్రయాలను బ్యాన్ చేసింది.