
- మందమర్రి ఏరియా సింగరేణి యాజమాన్యం
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియాలో సింగరేణి కార్మికులకు కేటాయించిన, ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్లల్లోకి ఇతరులు అక్రమంగా చొరబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏరియా సింగరేణి యాజమాన్యం గురువారం తెలిపింది. మూడో జోన్లోని క్వార్టర్లో ప్రైవేటు వ్యక్తి ఆక్రమించుకున్నాడని, చట్టప్రకారం ఖాళీ చేయిస్తామని తెలిపింది.
క్వార్టర్లోని సామాను తొలగింపుపై వివాదం…
మందమర్రి పట్టణం మూడో జోన్ డి- 574 సింగరేణి క్వార్టర్లో ఉంటున్న ప్రైవేటు వ్యక్తి వేముల శ్రీనివాస్ కుటుంబాన్ని ఖాళీ చేయించేందుకు సింగరేణి ఎస్అండ్పీసీ, ఎస్టేట్ఆఫీసర్లు, సిబ్బంది తీసుకున్న నిర్ణయం వివాదానికి దారి తీసింది. గురువారం ఆఫీసర్ల సమక్షంలో క్వార్టర్లోని సామగ్రిని బలవంతంగా బయట వేయడంపై శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. సింగరేణి ఖాళీ క్వార్టర్లలో ఎంతో మంది ప్రైవేటు వ్యక్తులు ఉంటున్నారని, తమను ఎందుకు ఖాళీ చేయిస్తున్నారంటూ వాదనకు దిగారు. కుటుంబ యాజమాని లేని సమయంలో పిల్లలను భయభ్రాంతులకు గురిచేస్తూ క్వార్టర్ నుంచి సామగ్రి బయటపడేయడమేంటని మండిపడ్డారు. మిగిలిన వాళ్లను క్వార్టర్ల నుంచి ఖాళీ చేయించేంత వరకు తాము ఇందులోనే ఉంటామని భీష్మించుకోవడంతో సిబ్బంది వెనుదిరిగారు.