గంగాపూర్ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

గంగాపూర్ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
  •     కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: రెబ్బెన మండలం గంగాపూర్ లో జరగనున్న శ్రీ బాలాజీ  వేంకటేశ్వర స్వామి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆసిఫాబాద్​కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. బుధవారం వెంకటేశ్వరాలయాన్ని సందర్శించి పూజలు చేశారు. 

అనంతరం జాతర నిర్వహణపై ఎస్పీ నితికా పంత్, అడిషనల్ ఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్ రావు, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి పలు శాఖల అధికారులతో రివ్యూ. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరిగే జాతర మహోత్సవాన్ని సక్సెస్ చేయాలని సూచించారు. భక్తులు సులభంగా దర్శనం చేసుకునేలా బారికేడ్లు ఏర్పాటు చేయాలని, జాతరకు వచ్చే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 

పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు నిర్వహించాలని, భక్తులకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కరెంట్ కోత లేకుండా చూడాలని, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, భక్తుల సౌకర్యార్థం బస్సులు నడపాలని, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో రెబ్బెన తహసీల్దార్ సూర్యప్రకాశ్, ఎంపీడీవో శంకరమ్మ, పంచాయితీ రాజ్, వైద్య ఆరోగ్య, విద్యుత్, దేవాదాయ శాఖల అధికారులు, జాతర నిర్వహణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.