నిఘా నీడలో స్ట్రాంగ్ రూమ్స్‌

నిఘా నీడలో స్ట్రాంగ్ రూమ్స్‌
  •     కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులతో ఐదంచెల భద్రత
  •      డబుల్ లాకింగ్ సిస్టమ్‌తో సీల్
  •      గ్రేటర్​లోని 3 కమిషనరేట్లలో15 స్ట్రాంగ్ రూమ్స్‌
  •      రిటర్నింగ్ ఆఫీసర్‌‌ ఆధ్వర్యంలో పర్యవేక్షణ
  •      భద్రతను పరిశీలించేందుకు అభ్యర్ధులకు చాన్స్

హైదరాబాద్, వెలుగు : ఈవీఎం, వీవీ ప్యాట్‌లు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్స్‌ వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాతో పాటు కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులతో కలిపి ఐదంచెల సెక్యూరిటీని ఉంచారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్​ను ఇప్పటికే రిటర్నింగ్‌ ఆఫీసర్లు సీల్ చేశారు. డబుల్ లాకింగ్‌ సిస్టమ్‌తో సీల్ చేశారు. ఆదివారం ఉదయం కౌంటింగ్ ప్రారంభమయ్యే సమయానికి వాటిని సంబంధిత అధికారులు మాత్రమే ఒపెన్ చేయనున్నారు. ఈ క్రమంలో స్ట్రాంగ్‌ రూమ్స్‌ వద్ద  పోలీసులు పహారా కాస్తున్నారు.  

ఒకే డోర్ నుంచి ఎంట్రీ..

 స్ట్రాంగ్ రూమ్‌కు ఒకే  ఎంట్రీ ఉండేలా చర్యలు తీసుకున్నారు. డోర్‌‌కి డబుల్ లాకింగ్‌  సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇందులో ఒక కీ మెజిస్ట్రేరియల్ అధికారి వద్ద ఉంటే, మరో కీ రూమ్ ఇన్​చార్జి కస్టడీలో పెట్టారు. వీరిద్దరినే బాధ్యులుగా చేశారు. రిటర్నింగ్ అధికారితో అనుమతి పొందిన వారు మినహా మిగతా వారిని స్ట్రాంగ్ రూమ్‌ పరిసర ప్రాంతాల్లోకి అనుమతించడం లేదు. 

అభ్యర్ధులు లేదా అభ్యర్ధులు సూచించిన ఏజెంట్లు మాత్రమే స్థానిక రిటర్నింగ్ అధికారి అనుమతితో స్ట్రాంగ్ రూమ్‌ను భద్రత పరిశీలించే అవకాశం కల్పించారు. స్ట్రాంగ్ రూమ్‌ పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించే విధంగా లైటింగ్ ఏర్పాటు చేశారు. పవర్ కట్‌కు అవకాశం లేకుండా జనరేటర్స్‌ కూడా అందుబాటులో పెట్టారు. స్ట్రాంగ్‌ రూమ్ పరిసర ప్రాంతాల్లో ఫైరింజిన్లను అందు
బాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు.

హెచ్​డీ క్వాలిటీతో సీసీటీవీ కెమెరాలు

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని స్ట్రాంగ్ రూమ్స్‌ను  కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈవీఎం, వీవీ ప్యాట్లు ఉన్న రూమ్ వద్ద మొదటి అంచెలో సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌ను మోహరించారు. ప్రతి షిప్ట్​లో 8 మందిని నియమించారు. వీరితో పాటు రెండో అంచెలో రెండు ప్లటూన్ల రాష్ట్ర ఆర్మ్డ్ పోలీసులను విధుల్లో నియమించారు. 

మూడో అంచెలో స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు చెందిన సివిల్‌ పోలీసులకు సెక్యూరిటీ డ్యూటీ వేశారు. స్ట్రాంగ్‌రూమ్స్‌ లోపల బయట హెచ్‌డీ క్వాలిటీతో సీసీ కెమెరాలను ఫిక్స్‌ చేశారు. వీటిని ఈసీ, ఆర్వో ఆఫీసులకు లింక్ చేశారు. కెమెరాలు నిరంతరం ఆన్‌లోనే ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆర్వో సీల్ చేసిన ఎంట్రీ లాక్స్‌ స్పష్టంగా కనిపించే విధంగా లైటింగ్ ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల ఫుటేజ్‌లను డీవీఆర్‌‌లో రికార్డ్‌ చేస్తున్నారు.