రోడ్లు, రైలు పట్టాలే పోరాట వేదికలై..

రోడ్లు, రైలు పట్టాలే పోరాట వేదికలై..

తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు సమరశీలతతో పోరాటం చేశారు. తమ వృత్తుల సాధనాలను చిహ్నాలుగా ఉపయోగించారు. సాంస్కృతిక చిహ్నాలను పోరాటానికి సంకేతాలుగా వాడుకోవడం ద్వారా తమ అస్తిత్వాన్ని బలంగా ప్రకటించారు. రోడ్లు, రైలు పట్టాలే పోరాట వేదికలైనయ్​. అయినా ఎక్కడా పబ్లిక్ ఆస్తులను కానీ, ప్రైవేటు ఆస్తులను కానీ ముట్టుకోలేదు. రోడ్లమీద కూర్చున్నరు. ఆ బాటలనే వేదికలుగా చేసుకొని ఆటలు ఆడిండ్రు, అక్కడే వండుకొని తిన్నరు,

తమ బతుకులు బజారు పాలయ్యాయన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజెప్పారు. ఉద్యమానికున్న మరొక పార్శ్వం పాట. పాట తెలంగాణ అస్తిత్వాన్ని ప్రకటించడమే కాదు, ప్రజలను చైతన్య పరిచే సాధనంగా పనిచేసింది. ఒక ధూంధాం కార్యక్రమం జరిగిందంటే చుట్టుముట్టు అనేక గ్రామాలు చైతన్య రూపాలైనయ్​. చదువు రాని వ్యక్తికి మాట చేరిందో లేదో తెలియదు కానీ పాట మాత్రం అందర్నీ స్పృశించింది.

ఆ పాట రూపంలో లోతైన సందేశం ప్రతి వ్యక్తిని చేరింది. అందువల్లే సకల జనులు ఉద్యమంలో భాగమయ్యారు. పాటతో పాటు చాలా సాహిత్యం కూడా వచ్చింది. ఈ సాహిత్యం భావవ్యాప్తి చేయగల మేధావులను తయారు చేసింది. వచ్చిన సాహిత్యాన్ని జీర్ణించుకొని దాన్ని మేధావులు ప్రజలకు చెరవేశారు. సాహిత్యం తెలంగాణను పరిచయం చేయడమే కాదు.. ఆంధ్ర పాలకులు సృష్టించిన సమస్యలకు తెలంగాణవాదం వెలుగులో నివృత్తి చేస్తూ ప్రజలను చైతన్య పరిచింది.