గాడిదతో వచ్చి నామినేషన్ వేసిన నిరుద్యోగి

గాడిదతో వచ్చి నామినేషన్ వేసిన నిరుద్యోగి

గాడిదతో వచ్చి ఓ  నిరుద్యోగి  నామినేషన్ వేశారు. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న  విషయం తెలిసిందే. ఈ నెల 3న నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో నామినేషన్ వేస్తున్నారు. 

ఈ  క్రమంలో ఓ నిరుద్యోగి.. రాజకీయ పార్టీలపై వినూత్నంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ .. నామినేషన్ వేసేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి గాడిదతో వచ్చాడు. అయితే, గాడిదను తీసుకురావడానికి అనుమతి లేదని పోలీసులు దానిని పంపించి వేశారు. 

ఇక, పుట్ట భాస్కర్ అనే మరో నిరుద్యోగి బనియన్, లుంగీ మీద నామినేషన్ వేయడానికి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు. అయితే, అధికారుల సూచన మేరకు రిటర్నింగ్ కార్యాలయంలో షర్టు వేసుకుని తన నామినేషన్ వేశారు.  

అనంతరం  భాస్కర్ మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవని, పేపర్లన్ని లీకే అవుతున్నందుకు నిరసనగా తాను నిరుద్యోగులతో వచ్చి నామినేషన్ వేశానని అన్నారు. తనకు ఎవరిపై కోపం లేదని, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని నామినేషన్ వేశానని భాస్కర్ పేర్కొన్నారు.