Exam Results : పాస్ కాకపోతే ఏమైతది.. జీవించటమే నిజమైన సాహసం.. చదువొక్కటే కాదు ముఖ్యం

Exam Results : పాస్ కాకపోతే ఏమైతది.. జీవించటమే నిజమైన సాహసం.. చదువొక్కటే కాదు ముఖ్యం

ఈ మధ్యనే ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. 'హమ్మయ్య ఓ పని అయిపోయింది' అని కొంతమంది సంబరపడుతుంటే... కొంత మంది మాత్రం.. 'ఎగ్జామ్స్ సరిగ్గా. రాయలేదేమో!', 'పాస్ కామేమో!', 'మంచి మార్కులు రాకపోతే మంచి కాలేజీలో సీట్ రాదేమో! ఇలాంటి ఆలోచనలతో భయపడుతున్నారు. కేవలం భయపడితే పర్వాలేదు. కానీ ఫలితాలు రాకముందే భయంతో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మరి ఈ భయాన్ని అధిగమించేది ఎలా ? ఫెయిల్ అయితే ఏదో ఒకటి చేసుకోవాల్సిందేనా? అదొక్కటే మార్గమా? కానే కాదు. ఆభయాన్ని అధిగమించే మార్గాల్ని వెతకాలి. తల్లిదండ్రులు కూడా దానికి సహకరించాలి.

“ఫియర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఫెయిల్యూర్ అనే మాట ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది. గతంలో పరీక్షలంటే.. కేవలం తరువాతి తరగతికి వెళ్లేందుకు మాత్రమే అని భావించే వాళ్లు. అంత భయపడేవాళ్లు కాదు. ఇంటర్ తర్వాత డిగ్రీ చదివి, ఆ పై ఏం చదవాలో ఆలోచించే వాళ్లు. కానీ ఇప్పుడలా కాదు.. ఈ పోటీ ప్రపంచంలో భవిష్యత్తంతా ముందే ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. ఇంటర్మీడియట్ అంటే అదేదో ఉన్నత స్థాయి పరీక్షలా భావిస్తున్నారు. విద్యాసంస్థలు, తల్లిదండ్రులు కూడా ఈ పోటీ మాయలో పడి పిల్లల్ని ర్యాంకుల వెంట పరిగెత్తిస్తున్నారు. విద్యార్థులు ఈ పందెంలో కాస్త వెనకబడితే చాలు, భవిష్యత్తు లేనట్లు విద్యాసంస్థలు వీరిని తరుముతూనే ఉన్నాయి. ఇక్కడి నుంచే మొదలవుతోంది. 'అమ్మో' ఫెయిల్ అయితే ఇంకేమైనా ఉందా? అన్న భయం. ఇదే చాలామందిలో తీవ్ర ఒత్తిడికి దారి తీస్తోంది. దీనితో పాటు తల్లిదండ్రులు తోటి పిల్లలతో పోల్చడం, అభద్రత, నిరాశ... ఇవన్నీ కూడా వారిని తెలియకుండానే మానసికంగా కుంగదీస్తున్నాయి.

జీవించడమే నిజమైన సాహసం

దీని గురించే సైకాలజిస్టులు మాట్లాడుతూ.. " సరిగ్గా చదువుకోకపోతే, మంచి ర్యాంకు తెచ్చుకోకపోతే, అమ్మానాన్నలకు అప్రతిష్ట తెస్తామని టీనేజర్లు చాలామంది భావిస్తుంటారు. కాస్త నిరాశ కలిగినా ఆ క్షణంలో ఏమీ ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మద్రాసులో 'నీట్'కి ఎంపిక కాలేదని చనిపోయిన బాలిక గానీ, హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న జస్టిన్ సింగ్ గానీ.... ఇలానే ఆలోచించారు. జీవించడమే నిజమైన సాహసం అని ఆలోచించలేకపోయారు.

ఇంటర్మీడియట్ వయసులో మెదడులో అనేక సున్నితమైన ఆలోచనలు దోబూచులాడుతుంటాయి. వాటిని నియంత్రించే క్రమంలో యువతీయువకులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. వీరిలో 'కోపం' బలమైన ఎమోషన్ పనిచేస్తుంది. అది విచక్షణను కోల్పోయేట్టు చేస్తోంది. వారి మీద వారికే అసహ్యం, పక్కవాళ్లంటే అసహ్యం, నాకే ఇలా ఎందుకు జరుగుతోంది అన్న నిరాశ.. డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి భావావేశాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఆ క్షణంలో "నా లైఫ్ ముగిస్తే అన్ని గొడవలు పోతాయి! అనుకుంటారు. అందుకే పిల్లల మనసులోని ఆలోచనలు. ప్రవర్తనను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు, టీచర్లు జాగ్రత్తగా గమనిస్తుందాలి. 

చదువొక్కటే కాదు

చదువంటే డాక్టరు, ఇంజినీర్, ఐఐటీ వంటివేనా? ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. చదువు ఒక మహాసముద్రం. ఎన్నో కెరీర్ ఆప్షన్లు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. ఒకటి కాకపోతే ఇంకొకటి. కానీ, అవేమీ పట్టించుకోకుండా నూటికి తొంభై శాతం మంది ఒకేలా ఆలోచిస్తున్నారు. ఈ పోటీ ప్రపంచం తల్లిదండ్రులను, పిల్లలను భయపెడుతోంది. ఉన్న చదువులకు పరీక్షలు లైఫ్ అండ్ డెత్ గా చూపిస్తున్నారు. అక్కడే జరుగుతుంది తప్పు. దేన్నైనా స్పోర్టివ్ గా తీసుకునేలా పెంచాలి. 'లైఫ్ అండ్ డెత్' లా కాదు.

దీనికి ఇంటి నుంచి బడి, సమాజం వరకూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయత్నం సాగాలి. ఇంట్లో అమ్మానాన్నలు పిల్లలతో మాట్లాడే సమయం ఉండడం లేదు. చదువుపట్ల కాస్త ఏకాగ్రత తగ్గినట్టు కనిపించినా 'ఇలా ఉంటే పాడయిపోతావు. ఆడుతుంటే ఎలా? బొమ్మలు వేసుకుంటుంటే ఎలా? క్లాసు పుస్తకాలు చదవకుండా ఏవేవో పుస్తకాలు చదువుతుంటే ఫెయిల్ అవుతావు నీ ఫ్రెండ్ చూడు. చదువుతూనే ఉంటుంది' అంటూ ఇలా ఇతర క్లాసు పిల్లలతో పోలిక తెస్తే చిన్నారులే కాదు టీనేజర్ల కూడా భరించలేదు. ఆత్మన్యూనతకు గురవుతారు. ఇది తల్లిదండ్రులు అర్ధం చేసుకోవాలి. పరిష్కారమేంటి?

• పిల్లలో ఇలాంటి భయం పోవాలంటే తల్లిదండ్రులు వారితో పాజిటివ్ గా మాట్లాడటం అలవాటుగా చేసుకోవాలి.. ఏరా ఈ సారయినా పాసవుతావా". "ఈ జన్మలో నీకు ఐఐటీ ర్యాంక్ వస్తుందా?". ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. దానికి బదులు ఫెయిల్ అయినా ఏం కాదు అనే భరోసా వారికి ఇవ్వాలి. 'ప్రతిభకు మార్కులు ఒక్కటే కొలమానంకాదు. ఏ రంగంలో ఎప్పుడు అయినా రాణించొచ్చు' అని తల్లి దండ్రులు వాళ్లకి తెలియచెప్పాలి. 
• పిల్లలు వాళ్ల భయాలను మీకు చెప్పేలా చేయాలి. దాన్నుంచి ఎలా బయటపడాలనేది. మీరు చెప్పగలగాలి. అవసరం అనుకుంటే మీ వ్యక్తిగత అనుభవాల్ని చెప్పినా మంచిదే. ఫెయిల్ అయితే... ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో వారిని ఓ కాగితంపై రాయమనాలి. అందులో కచ్చితంగా ఏదో ఒకటి చేసుకోవాలనే వాక్యాలు ఉండవు.
• ఏదో అయిపోతుందని అనుకోవడం, దాని నుంచి తప్పించుకోవడం సమస్యకు పరిష్కారం కాదని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. ఆ భయాన్ని ఎలా అధిగమించాలనేది నేర్పించాలి. ఫలానా సబ్జెక్టులో మార్కులు సరిగ్గా రావనుకుంటే దానికి పరిష్కారాలు వాళ్లనే
ఆలోచించమనాలి.
• సక్సెస్ స్టోరీస్ తో పాటుగా, అవిజయాలతో ముడిపడి ఉన్న కథల్ని కూడా పిల్లలకు చెప్పు ఉండాలి. ఓడిపోవడం ధైర్యవంతుల లక్షణం. అని అందరూ తెలుసుకోవాలి. ఫెయిల్యూర్ నుంచి బయటికి రావాలంటే ముందు ఆ ఓటమిని ఒప్పుకోవాలి. అందులోని తప్పొప్పులని విశ్లేషించుకోవాలి. ఆ పిల్లల సామర్థ్యాన్ని గుర్తించగలగాలి. ప్రతీ ఒక్కరిలో ప్రత్యేకత ఉంటుంది. ఒక్క మార్కు తగ్గినా, వైఫల్యం ఎదురైతే జీవితం ముగిసిపోయినట్లు కాదనేది వాళ్లకు వివరించాలి. ఈ పరీక్ష కాకపోతే మరొకటి అనే ధోరణి పెంచాలి.
• ఎట్టి పరిస్థితుల్లో తోటివారితో పోల్చకూడదు. దానివల్ల వాళ్ళు ఇంకా కుంగిపోయే ప్రమాదం ఉంటుంది. 
• పిల్లల మీద ఓవర్ యాంబిషన్తో, ఓవర్ ఎక్స్ పెక్టేషన్స్ ఉండకూడదు.
* పిల్లలు పెరుగుతున్న క్రమంలో డిఫరెంట్ లెవల్స్ కౌన్సెలింగ్ ఇప్పించాలి. 
• ప్రవర్తనలో ఏదైనా మార్పు గమనిస్తే సైకాలజిస్టు దగ్గరకు తీసుకువెళ్లడం మంచిది" అన్నారామె.