ఇంజినీరింగ్‌‌‌‌పై తగ్గుతున్న ఆసక్తి

ఇంజినీరింగ్‌‌‌‌పై తగ్గుతున్న ఆసక్తి

ముంబై:  గత కొన్నేళ్లుగా ఇంజనీరింగ్,  టెక్నాలజీ కోర్సులలో చేరే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.  ఐటీ కంపెనీల నియామకం మందగించడం దీనికి కారణమని టీమ్‌‌‌‌లీజ్ ఎడ్‌‌‌‌టెక్ కో–ఫౌండర్ నీతి శర్మ అన్నారు. ఇంజనీరింగ్,  టెక్నాలజీ కోర్సులలో 2016–-17లో బీటెక్‌‌‌‌లో నమోదు చేసుకున్న వారి సంఖ్య  సుమారు 40 లక్షల నుంచి 2020-21 నాటికి 36 లక్షలకు పడిపోయింది.

 గత ఐదేళ్లలో కోర్ స్ట్రీమ్‌‌‌‌లలో ఉద్యోగావకాశాలు తగ్గిపోవడంతో బీటెక్​, బీఈ కోర్సులకు ఆదరణ తగ్గింది. ఐటీ కంపెనీల మొత్తం తాజా నియామకాలు 2022లో 26 శాతం నుంచి 2023లో 15 శాతానికి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  10 శాతం వరకు తగ్గాయని శర్మ చెప్పారు. అయితే క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,  సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులకు ఇప్పటికీ  డిమాండ్ ఉందని పేర్కొన్నారు. 

ప్రస్తుతం ఉద్యోగులు, ఫ్రెషర్లు,  అనుభవజ్ఞులు ఐటీ రంగంలో పోటీని కొనసాగించడానికి తమ డొమైన్‌‌‌‌లలో నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారని అన్నారు. టైర్–1 నగరంలోని ఐటీ కంపెనీలు డిజిటల్ ట్రాన్స్‌‌‌‌ఫర్మేషన్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ డొమైన్‌‌‌‌లకు ఇక నుంచి కూడా డిమాండ్‌‌‌‌ ఉంటుందని ఆమె వివరించారు.  ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఐటీ సేవల సంఖ్య 4 శాతం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు ఆమె తెలిపారు. 

2022–23లో మునుపటి సంవత్సరం కంటే ఫ్రెషర్ హైరింగ్‌‌‌‌లో 9 శాతం తగ్గుదల ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 5 శాతం తగ్గుతుందని అంచనా. మొత్తం మీద నియామకాలు 40 శాతం తగ్గవచ్చు. గత సంవత్సరంతో పోల్చితే, మొత్తం ఫ్రెషర్ నియామకాలు దాదాపు 40-–50 శాతం తగ్గుతాయని భావిస్తున్నారు. ఐటీ కంపెనీల కార్యకలాపాలు మందగించడంతో, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు కూడా భారతదేశంలోని మొత్తం ఐటీ నియామకాలలో 50 శాతం జాబ్స్​ను తగ్గించవచ్చన్నారు.