మాకు ఆ మేడమే చదువు చెప్పాలి : స్కూల్ స్టూడెంట్స్

మాకు ఆ మేడమే చదువు చెప్పాలి  : స్కూల్ స్టూడెంట్స్
  • టీచర్ డిప్యూటేషన్ పై పంపించడంతో విద్యార్థుల ఆవేదన 
  • ఎంఈవోను కలిసి వినతి

జైపూర్(భీమారం), వెలుగు: మాకు ఆ మేడమే పాఠాలు చెప్పాలని, తమ టీచర్​ను డిప్యూటేషన్​పై పంపొద్దని మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ కోరారు. తల్లిదండ్రులపాటు వెళ్లి ఎంఈవో శ్రీనివాస్ ను కలిసి వేడుకున్నారు. ప్రైమరీ స్కూల్​లో 67 మంది విద్యార్థులు చదువుతుండగా నలుగురు టీచర్లు పనిచేస్తున్నారు. కాగా పరిమళ అనే ఇంగ్లీష్​ టీచర్​ను అధికారులు మండలంలోని ధర్మారం స్కూల్​కు డిప్యూటేషన్ పై పంపించారు. 

దీంతో ఆ స్కూల్ విద్యార్థులు మంగళవారం ఎంఈవోను కలిసి కన్నీళ్లు పెట్టుకున్నారు. పరిమళ మేడమ్​ను మరోచోటికి పంపితే తాము స్కూల్​కు వెళ్లమని పేర్కొన్నారు. ఆ టీచర్ ఉంటేనే తమ పిల్లలను స్కూల్ కు పంపిస్తామని తల్లిదండ్రులు సైతం స్పష్టం చేశారు. ఎంఈవోకు వినతిపత్రం అందించారు.