ప్రొ కోదండరాం చట్టసభల్లోకి వెళ్లకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటోంది: విద్యార్థులు నిరసన

 ప్రొ కోదండరాం చట్టసభల్లోకి వెళ్లకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటోంది:  విద్యార్థులు నిరసన

కోర్టులో పిటిషన్ వేసి ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ పదవిని బీఆర్ఎస్ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సిటీ లైబ్రరీలో విద్యార్థులు, నిరుద్యోగులు మోకాళ్ళ మీద నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిరుద్యోగ విద్యార్థులు డి సలీం, వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమంలో ముందుండి పోరాడిన కోదండరాంను తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పక్కన పెట్టిందని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే పదవి ఇస్తే కోర్టుకెళ్లి అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.చట్టసభల్లోకి ప్రొఫెసర్ కోదండరాంను వెళ్లకుండా అడ్డుకుంటుందని..  ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టుకొని డ్రామాలు ఆడుతున్న బీఆర్ఎస్ పార్టీని లోక్ సభ ఎన్నికల్లో బొంద పెడతామని వారు హెచ్చరించారు.

కోదండరాం ఎమ్మెల్సీని అడ్డుకున్నందుకు తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కెసీఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ లకు వ్యతిరేకంగా నినాదాల చేశారు. అనంతరం తెలంగాణ జన సమితి నగర అధ్యక్షులు నరసయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ రథసారథిగా పనిచేసిన కోదండరాంకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అడుగడుగున ఆటంకాలు ఎదుర్కొన్నారని చెప్పారు. కోదండరాంపై కోర్టులో వేసిన పిటిషన్ ను వెంటనే బేషరతుగా విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ వ్యాప్తంగా నిరసన తప్పదని ఆయన హెచ్చరించారు.

 తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ జన సమితి పార్టీ  అధ్యక్షుడు కోదండరామ్ ను గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించగా.. గవర్నర్ తమిళిసై అమోదించారు. అయితే, బీఆర్ఎస్ పార్టీ.. దీన్ని తప్పుబట్టింది. గతంలో మేము పంపిన  గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ప్రతిపాదనలను గవర్నర్ తిరస్కరించారని.. ఇప్పుడెలా అమోదిస్తారంటూ బీఆర్ఎస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో హైకోర్టు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై స్టే విధించింది.