గురునానక్ కాలేజీ ముందు స్టూడెంట్స్ ఆందోళన

గురునానక్ కాలేజీ ముందు స్టూడెంట్స్ ఆందోళన
  • అకడమిక్​ ఇయర్​ వృథా అయ్యిందని ఆవేదన
  • బాధిత స్టూడెంట్లపై పోలీసుల లాఠీచార్జి

ఇబ్రహీంపట్నం, వెలుగు : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజీ​ ముందు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గురువారం ఆందోళనకు దిగారు. వర్సిటీ పేరిట 4000 మంది స్టూడెంట్లను 2022 -‌‌‌‌‌‌‌‌విద్యా సంవత్సరంలో జాయిన్ చేసుకొని ఇప్పటికీ పరీక్షలు నిర్వహించలేదని ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని పేర్కొంటూ ధర్నాకు కూర్చున్నారు. వారికి  ఎన్ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. యూనివర్సిటీగా మారిందని చెప్పడంతో లక్షలు కట్టి తమ బిడ్డల్ని జాయిన్​ చేశామని చెప్పారు. ఎగ్జామ్స్ నిర్వహించకపోవడంతో ఒక అకడమిక్​ ఇయర్​ వృథా అయ్యిందని వాపోయారు. వేరే యూనివర్సిటీల్లో జాయిన్ అవ్వాలన్నా ప్రస్తుతం అడ్మిషన్లే లేవని చెప్పారు. అనుమతి లేకుండానే యూనివర్సిటీగా ప్రకటించుకుని.. ఎందుకు విద్యార్థులను జాయిన్ ​చేసుకున్నారో తెలపాలని గురునానక్ మేనేజ్ మెంట్​ను నిలదీశారు.

ప్రభుత్వ అండను ఉపయోగించి పోలీసులతో  తమపై దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. గురునానక్​ మేనేజ్​మెంట్ తమకు న్యాయం చేసేవరకు నిరసన ఆపేదిలేదని బాధితులు స్పష్టం చేసారు.  విద్యార్థులకు న్యాయం చేయాలని బల్మూరి వెంకట్ డిమాండ్​ చేశారు. ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో విద్యార్థులను, తల్లిదండ్రులను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించారు. దాంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ విద్యార్థులపై లాఠీచార్జి​ చేశారు. బల్మూరి వెంకట్​తో సహా పలువురిని అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పోలీస్‌‌‌‌ స్టేషన్​కు తరలించారు.