మునుగోడు, వెలుగు: మునుగోడు మండలం పలివెల జిల్లా పరిషత్ జడ్పీ స్కూల్‌లో మూడు నెలల నుంచి తెలుగు టీచర్ లేరని, ఇప్పటికైనా టీచర్‌ను నియమించాలని విద్యార్థులు, ఏఐఎస్‌ఎఫ్, బీసీ సంఘం ఆధ్వర్యంలో పలిమెల చౌరస్తాలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య మండల అధ్యక్షుడు గోపగోని ఉదయ్ మాట్లాడుతూ..
విద్యార్థులు తెలుగు టీచర్ లేక మూడు నెలల నుంచి నష్టపోతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. 10వ తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నప్పటికీ ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. తెలుగు ఉపాధ్యాయుడిని తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు.
బీసీ సంఘం నాయకులు ఆనగంటి కృష్ణ పాల్గొని విద్యార్థుల హక్కుల పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ ఉపాధ్యక్షుడు గోసుకొండ మల్లేష్, చేనేత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు చెరుకు సైదులు, సీపీఐ గ్రామ శాఖ కార్యదర్శి ఆనగంటి నరసింహ, వరికుప్పల రాజు, కొండూరు మల్లికార్జున్, దాడి జితేందర్ రెడ్డి, మాధగోని మల్లయ్య గోసుకొండ రవి, నాతి రమేశ్, గజ్జల నాగరాజు, శివర్ల నాగరాజు, వరికుప్పల శంకర్, పంతంగి గోపాలు, యాదయ్య, నరసింహ, జెట్టి మల్లయ్య పాల్గొన్నారు.
