ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

 నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా జడ్జి రాజేశ్​ బాబు సూచించారు. లీగల్ లిటరసీ డే సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాయ్స్ కాలేజీలో న్యాయ సేవా సదస్సును బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల పట్ల సోదర భావంతో మెలుగుతూ, సాధ్యమైనంత సహకారాన్ని అందించాలన్నారు.   ర్యాంగింగ్ చేస్తే జరిగే పర్యవసానాలపై   వివరించారు. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి చదువు తప్ప వేరే మార్గం లేదన్నారు.  కాలేజీలో పూర్వ విద్యార్థులతో ఓ సంఘాన్ని ఏర్పాటు చేసి కళాశాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. సీనియర్ సివిల్ జడ్జి సబిత మాట్లాడుతూ..18 ఏళ్లలోపు పిల్లలు మోటార్ సైకిల్ నడపవద్దని సూచించారు. తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని కోరారు. విద్యార్థులు పొక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి స్వరూప, మౌనిక, నోడల్ ఆఫీసర్ వెంకటరమణ, సీఐ హనుమంతు, కళాశాల ప్రిన్సిపాల్ లలిత పాల్గొన్నారు. 

మొండి బకాయిలు లేకుండా చూడాలి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జిల్లాలో ఇప్పటి వరకు బ్యాంకుల్లో రూ.180.36 కోట్ల బకాయిలు ఉండడంపై అడిషన్​ కలెక్టర్ మనూ చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్​లో బుధవారం జడ్పీ చైర్ పర్సన్ పద్మావతి తో కలిసి మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ రంగాల్లో ఇప్పుడిప్పుడే అభివృద్ధి సాధిస్తున్న నాగర్ కర్నూల్ జిల్లాలో పారిశ్రామిక,  వ్యవసాయ రంగాల్లో జీవన ఉపాధి కోసం ఆయా శాఖల ద్వారా వచ్చే లోన్ల దరఖాస్తులను పరిశీలించి బ్యాంకర్లు  త్వరగా గ్రౌండింగ్ చేయాలన్నారు. జిల్లా అభివృద్ధిలో బ్యాంకులు భాగస్వాములు కావాలి  తప్పా, బ్యాంకు చుట్టూ లబ్ధిదారులను తిప్పించుకోవద్దని కోరారు. జిల్లాలో ఇప్పటి వరకు ఆయా బ్యాంకుల్లో రూ.180.36 కోట్ల మొండి బకాయిలు ఉన్నాయని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్​బీఐఎల్​ డీఓ విభవ్ వ్యాస్, నాబార్డ్ డీడీఎం షణ్ముఖ చారి, ఎస్​బీఐ ఆర్​ఎం మధుబాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్ కౌశల్ కిశోర్ పాండే, డీఆర్​డీఓ నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు. 

ఓటరు జాబితాలో మార్పుల కోసం దరఖాస్తు చేసుకోవాలి

నారాయణపేట, వెలుగు: ఓటరు జాబితాను పరిశీలించుకొని మార్పులు చేర్పులు ఉంటే డిసెంబర్ 8లోగా దరఖాస్తు లు చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023 స్పెషల్ సమ్మరి రివిజన్ డ్రాఫ్ట్ ఎలక్టరోల్  విడుదల చేశామని, డ్రాఫ్ట్ లిస్ట్​ను పరిశీలించి, తప్పులు ఉంటే మళ్లీ అప్లయ్​ చేసుకోవాలని,  క్షేత్రస్థాయిలో పరిశీలించి జనవరి 3వ తేదీ లోగా అప్డేట్ చేసి జనవరి 5 వరకు ఫైనల్​ లిస్ట్​ రిలీజ్​ చేస్తామని తెలిపారు.  

ప్రతి ఒక్కరు ఓటు  నమోదు చేసుకోవాలి

వనపర్తి : 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ డి వేణుగోపాల్ సూచించారు.  జిల్లాకేంద్రంలో బుధవారం ఓటరు నమోదు అవగాహన ర్యాలీ ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్​ మాట్లాడుతూ.. వనపర్తి నియోజక వర్గంలో ఓటరు జాబితా బూత్ స్థాయి అధికారుల వద్ద అందుబాటులో ఉంచామన్నారు. జాబితాలో ఏవైనా మార్పులు ఉంటే వెంటనే సవరించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో డీఐఈఓ హుస్సేన్, డీఈఓ రవీందర్, డీపీఆర్ఓ రషీద్, ప్రిన్సిపాల్ మద్దిలేటి, ఎలక్షన్ అధికారి రమేష్, ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్, సైన్స్ అధికారి శ్రీనివాస్  పాల్గొన్నారు.

నాగర్ కర్నూల్ టౌన్ : ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు ఉంటే సరి చేసుకోవాలని  కలెక్టర్ ఉదయ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్​ జాబితాలను అన్ని పోలింగ్ స్టేషన్లో ఉంచినట్లు పేర్కొన్నారు.  పేర్లు మార్పులు చేర్పులు, పోలింగ్ స్టేషన్ మార్పు వంటివి ఏమైనా ఉంటే వచ్చేనెల 8 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.  జనవరి 3వ తేదీన లిస్ట్​ అప్​డేట్​ చేస్తామని తెలిపారు. 

గవర్నర్​ వ్యవస్థను రద్దు చేయాలి

రాష్ట్రంలో మోడీ పర్యటనను అడ్డుకుంటాం

నారాయణపేట, వెలుగు; గవర్నర్​  వ్యవస్థ ఓ పనికిమాలిన వ్యవస్థ అని,   ఆ వ్యవస్థను రద్దు చేయాలని  తమపార్టీ కోరుతోందని సీపీఎం  కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్​ అన్నారు.  స్థానిక పార్టీ ఆఫీస్​లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.  రాష్ట్ర సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్లు వ్యవహరిస్తున్నారని,  దీనిపై త్వరలో బీజేపీ యేతర పార్టీలతో  ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్​ గెలవడం దేశంలో ముఖ్య ఘట్టమని,  ఇది దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుందన్నారు. బీజేపీని ఓడించడానికి తాము టీఆర్ఎస్​తో కలిసి పనిచేస్తామన్నారు.  బీజేపీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన చేస్తోందని విమర్శించారు.  మోదీ దేశ పాలనపై దృష్టి పెట్టకుండా  మతాల చుట్టూ తిరుగుతున్నారన్నారు.  ఈనెల 12న  పీఎం మోడీ  తెలంగాణకు వస్తున్న సందర్భంగా ఆయన పర్యటనను అడ్డుకుంటామన్నారు.   ఈ సమావేశంలో కార్యక్రమంలో సీపీఎం  నాయకులు వెంకట్రామిరెడ్డి, గోపాల్, బల్​రాం ఉన్నారు.

భక్తులతో కిక్కిరిసిన మైసిగండి

అమనగల్లు, వెలుగు: కడ్తల్ మండలం మైసిగండి మైసమ్మ ఆలయం బుధవారం భక్తులతో కిక్కిరిసింది. జాతరలో భాగంగా అమ్మవారి క్షీరాభిషేకంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రంగారెడ్డి జడ్పీచైర్ పర్సన్ అనితా రెడ్డి పాల్గొన్నారు. జాతరలో భాగంగా అమ్మవారికి క్షీరాభిషేకంతో పాటు నిర్వహించిన విశేషాలంకరణ, కుంభ హారతి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. 

పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు:  పోలీసు సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని  ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు అన్నారు.  పోలీసు సిబ్బందికి జర్కిన్స్, రెయిన్ కోట్స్ బుధవారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  జిల్లాలో పోలీసులకు ఇటీవల సిబ్బంది వైద్య పరిక్షలను నిర్వహించామని, కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై శ్రద్ద వహించాలని సూచించారు. కురుమూర్తి జాతరలో విధులు నిర్వహించిన ఆఫీసర్స్, సిబ్బందిని అభినందించారు. ఎఎస్పీ రాములు, డీఎస్పీలు శ్రీనివాస్, మహేష్, ఆదినారాయణ, రమణారెడ్డి, మధు పాల్గొన్నారు. 

మెడిసిన్ సీట్లు సాధించిన స్టూడెంట్లకు  సన్మానం

వనపర్తి టౌన్, వెలుగు:   జిల్లాలో ఎంబీబీఎస్  సీట్లు సాధించిన దళిత స్టూడెంట్లకు బుధవారం ఎమ్మార్పీఎస్, ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో  సన్మానం చేశారు. మందడి చేతన్, బండారు శ్రీవల్లీ  ఎంబీబీఎస్, మల్లెల నేహా పీడియాట్రిక్ పీజీ లో  సీటు సాధించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల్లో    డాక్టర్ సీట్లు సాధించడం గొప్పవిషయం అన్నారు.  ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షులు గద్వాల కృష్ణ, ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ రాజనగరం రాజేశ్​, బోరెళ్లి వెంకటయ్య, కంటె నిరంజన్ పాల్గొన్నారు.

ఆత్మ రక్షణ కోసం కరాటే

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : విద్యార్థిణులు ఆత్మ రక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కుమార్ షాజహాన్ సుల్తానా అన్నారు. డిగ్రీ కళాశాల ఆవరణలో కరాటే శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విమెన్ ఎంపవర్ మెంట్ ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఆత్మ రక్షణ కోసం కరాటే విద్య ఎంతో అవసరమని అన్నారు.  ఈ కార్యక్రమంలో విమెన్ ఎంపర్​మెంట్​ అధికారిని ఉమాదేవి, వైస్ ప్రిన్సిపాల్ షేక్ ఖాజాబీ, అధ్యాపకులు వనిత, కరాటే మాస్టర్ రవి పాల్గొన్నారు.