కేసీఆర్ పర్యటనలో అరెస్టుల పర్వం

కేసీఆర్ పర్యటనలో అరెస్టుల పర్వం

నిజామాబాద్ జిల్లాలో  సీఎం కేసిఆర్ పర్యటన సభ సందర్బంగా అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ప్రతిపక్షాలకు చెందిన నాయకులు, కార్యకర్తలను ముందస్తుగానే అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ టూర్ జరుగుతున్నప్పుడు కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. జిల్లా కేంద్రంలో సీఎం కాన్వాయిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెలంగాణ యూనివర్సిటి విద్యార్ధులను పోలీసులు అరెస్ట్ చేశారు.
జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం సుమారు 60 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వెళుతున్న టైంలోనూ పోలీసులు లాఠీలకు పని కల్పించారు. కలెక్టరేట్ కు బయటుదేరి వెళుతున్న సీఎం కాన్వాయ్ ని మార్గం మధ్యలో  తెలంగాణ యూనివర్సిటి విద్యార్ధులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. గుంపులుగా వస్తున్న విద్యార్థులను గుర్తించిన పోలీసులు విద్యార్ధులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. పోలీసులు తమను బలవంతంగా అదుపులోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు కేసిఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.