మేనేజ్‌మెంట్లకు వ్యతిరేకంగా తీర్పు వస్తే.. స్టూడెంట్లకు సర్టిఫికెట్లు ఇవ్వరు

మేనేజ్‌మెంట్లకు వ్యతిరేకంగా తీర్పు వస్తే..  స్టూడెంట్లకు సర్టిఫికెట్లు ఇవ్వరు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీలో అడ్మిషన్ల కోసం నిర్వహించే దోస్త్  (డిగ్రీ ఆన్​లైన్  సర్వీసెస్  తెలంగాణ) ప్రక్రియను ప్రైవేటు కాలేజీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దోస్త్  ప్రక్రియతో సంబంధం లేకుండా అడ్మిషన్లు నిర్వహించుకునేందుకు కొన్ని కాలేజీలు ఈ ఏడాది కూడా హైకోర్టు నుంచి స్పెషల్ పర్మిషన్  పొందాయి. కానీ, హైకోర్టు తీర్పులోని అంశాలపై మాత్రం ఇటు సర్కారు కానీ, నాన్ దోస్త్ లోని డిగ్రీ కాలేజీలు కానీ ప్రచారం చేయడం లేదు. అయితే, ఆయా కాలేజీల్లో చేరే విద్యార్థులకు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశమూ లేకపోలేదని ఉన్నత విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గురుకుల డిగ్రీ కాలేజీలు మినహా మిగిలిన అన్ని కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ప్రభుత్వం 2016లో దోస్త్ ఆన్​లైన్ అడ్మిషన్ల విధానాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా ఏ స్టూడెంట్ అయినా ఎక్కడైనా చదువుకునేలా, ఒకేసారి దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించారు. ఈ విధానంలో ప్రస్తుతం స్టూడెంట్లు కోరుకున్న చోట సీట్లు అలాటవుతున్నాయి. 

అయితే,  తమతో చర్చించకుండానే దోస్త్ విధానం తెచ్చారని, తమకు ప్రత్యేకంగా అడ్మిషన్లు చేసుకునేలా అవకాశమివ్వాలని కొన్ని ప్రైవేటు డిగ్రీ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏటా హైకోర్టు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని దోస్త్ తో సంబంధం లేకుండానే అడ్మిషన్లు నిర్వహించుకుంటున్నాయి. చట్టంలోని లొసుగులను పట్టుకొని, మేనేజ్ మెంట్లు కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుంటున్నా.. హయ్యర్  ఎడ్యుకేషన్ కౌన్సిల్, సర్కారు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మేనేజ్ మెంట్లతో పలుమార్లు సమావేశమైనా, వారి నుంచి సరైన స్పందన రాలేదని కౌన్సిల్ అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది 2023–24లో కూడా దోస్త్ తో సంబంధం లేకుండానే అడ్మిషన్లు చేసుకునేందుకు 39 కాలేజీలు హైకోర్టు నుంచి స్పెషల్  పర్మిషన్  పొందాయి. ఈ కేసు జూన్15కు వాయిదా పడింది. 

వ్యతిరేకంగా తీర్పు వస్తే సర్టిఫికెట్లు ఇవ్వరు 

నాన్ దోస్త్  కాలేజీలు తుది తీర్పుకు లోబడి ఉండాలనే నిబంధన కూడా హైకోర్టు ఇటీవల మధ్యంతర తీర్పును వెల్లడించింది. కోర్టులో కేసు నడుస్తున్న విషయాన్ని స్టూడెంట్లకు చెప్పాలని, వారి నుంచి అండర్​టేకింగ్ లెటర్లు తీసుకోవాలని సూచించింది. తీర్పు మేనేజ్ మెంట్లకు వ్యతిరేకంగా వస్తే, డిగ్రీ సర్టిఫికెట్లు ఇవ్వబోరని స్పష్టం చేసింది. అయితే, ఈ విషయాన్ని మేనేజ్​మెంట్లు విద్యార్థులకు చెప్పకుండా దాచిపెడుతున్నాయి. ప్రస్తుతం గురునానక్, శ్రీనిధి ప్రైవేటు యూనివర్సిటీల్లో 2022–23లో సర్కారు నుంచి పూర్తి స్థాయి అనుమతి రాకముందే అడ్మిషన్లు నిర్వహించారు. ఇప్పటికీ ఆ వర్సిటీలకు పర్మిషన్ రాలేదు. దీంతో ఆ స్టూడెంట్లు ఏం చేయాలో తెలియక అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే ఈ కాలేజీలకూ వచ్చే అవకాశం లేకపోలేదని ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఆ కాలేజీల్లో చేరే స్టూడెంట్లు కోర్టు తీర్పునూ పరిశీలించి చేరాలని సూచిస్తున్నారు.

నాన్ దోస్త్ కాలేజీల్లో కొన్ని ...

భారతీయ విద్యా భవన్ సొసైటీ, భవన్స్ న్యూసైన్స్  కాలేజీ, అరోరా ఎడ్యుకేషన్  సొసైటీ, అరోరా డిగ్రీ అండ్  పీజీ కాలేజీ, అవంతి డిగ్రీ అండ్  పీజీ కాలేజీ, భద్రుక కాలేజ్  ఆఫ్ కామర్స్ అండ్  ఆర్ట్స్, అవినాష్​ కాలేజ్ ఆఫ్  కామర్స్, శివశివాణీ ఎడ్యుకేషనల్ సొసైటీ, శివశివాణీ డిగ్రీ కాలేజీ, నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ, నారాయణ డిగ్రీ కాలేజీ, శ్రీనారాయణ డిగ్రీ కాలేజీ, వాసవి ఫౌండేషన్, ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్  మేనేజ్​మెంట్ అండ్  కామర్స్, ఝాన్సీ లక్ష్మీబాయి మహిళా మండలి, రూట్స్ డిగ్రీ కాలేజీ, అవినాష్ బ్రహ్మదేవర ఎడ్యుకేషన్ సొసైటీ, భవన్స్ వివేకానంద కాలేజ్ ఆఫ్ సైన్స్ హ్యూమానిటీస్ అండ్ కామర్స్, ఈ థామస్ డిగ్రీ కాలేజీ, న్యూసెంట్ జోసెఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ, సెయింట్ పాల్స్ డిగ్రీ కాలేజీ, శాంతి ఎడ్యుకేషనల్ సొసైటీ, ఆద్య డిగ్రీ కాలేజీ, హర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, పినాకిల్ డిగ్రీ కాలేజీ, పన్నాల రామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ, హైదరాబాద్ స్కూల్  ఆఫ్  బిజినెస్ డిగ్రీ కాలేజీ, తపస్య డిగ్రీ కాలేజీ, శ్రీవెంకటేశ్వర ఎడ్యుకేషన్  సొసైటీ, ఎల్జీనైట్  డిగ్రీ కాలేజీ, సన్  డిగ్రీ కాలేజీ, సన్ ప్రైడ్ డిగ్రీ కాలేజీ, హర్షిణి ఎడ్యుకేషనల్  సొసైటీ, ఎడ్వంటా డిగ్రీ కాలేజీ, ఐ క్రియేట్ డిగ్రీ కాలేజీ, ఓబీఎస్ డిగ్రీ కాలేజీ.

స్టూడెంట్ల నుంచి  అండర్‌‌‌‌ టేకింగ్‌‌ తీసుకోవాలి

 దేశవ్యాప్తంగా డిగ్రీ, పీజీ అడ్మిషన్లకు కామన్  విధానం తీసుకొస్తున్నారు. తెలంగాణలో ముందుగానే డిగ్రీలో దోస్త్  విధానంలో సెంట్రలైజ్  అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నాం. దీన్ని వ్యతిరేకిస్తూ కొన్ని కాలేజీలు హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తీసుకొని అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగిస్తున్నాయి. అయితే, కాలేజీలు కోర్టు తీర్పులను స్టూడెంట్లకు వివరించి వారి నుంచి అండర్​టేకింగ్ తీసుకోవాలి. ఒకవేళ మేనేజ్​మెంట్లు కేసు ఓడిపోతే, ఆ స్టూడెంట్లకు సర్టిఫికెట్లను యూనివర్సిటీలు ఇవ్వబోవు. ఆయా కాలేజీల్లో చదివితే, స్కాలర్ షిప్ కూడా రాదు. ఈ విషయాన్ని స్టూడెంట్లు తెలుసుకోవాలి.

- ప్రొఫెసర్ లింబాద్రి,     హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్