రాహుల్ సిటిజన్షిప్పై..ఢిల్లీ హైకోర్టులో సుబ్రమణ్యస్వామి పిటిషన్

రాహుల్ సిటిజన్షిప్పై..ఢిల్లీ హైకోర్టులో సుబ్రమణ్యస్వామి పిటిషన్

రాహుల్ గాంధీ పౌరసత్వం అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చారు బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి..  రాహుల్ సిటిజన్ షిప్ హోదాపై  కేంద్రం స్పందించాలని సుబ్రమణ్యస్వామి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ సిటిజన్ షిప్ పై గతంలో అనేకసార్లు కేంద్రాన్ని సంప్రదించానని.. తన ఫిర్యాదుపై స్టేటస్ రిపోర్టును అందజేయాల్సిందిగా కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించాలని సుబ్రమణ్యస్వామి పిటిషన్ లో కోరారు. 

రాహుల్ గాంధీ పౌరసత్వంపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి 2019లోనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. తాను బ్రిటిష్ పౌరుడినని బ్రిటన్ ప్రభుత్వానికి రాహుల్ సమర్పించిన డాక్యుమెంట్స్ తెలియజేయడం రాజ్యాంగ విరుద్ధమని..  రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు.  రాజ్యాంగంలోని ఆర్టికల్ 9, 1955 నాటి భారత పౌరసత్వ చట్టం ప్రకారం.. ద్వంద్వం పౌరసత్వం నిషేధించబడిందని సుబ్రమణ్యస్వామి వాదిస్తున్నారు. 

2003లో రిజిస్టర్ అయిన యూకె కు చెందిన కంపెనీ బ్యాకప్స్ లిమిటెడ్ వార్షిక రిటర్స్ లో రాహుల్ గాంధీ జాతీయత బ్రిటీష్ అని పేర్కొన్నారని సుబ్రమణ్య స్వామి అన్నారు. ఇది రాహుల్ పౌరసత్వంపై అనేక సందేహాలను కలిగిస్తుందని ఆరోపించా3రు. రాహుల్ బ్రిటీష్ పౌరుడై ఉంటే.. భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాశారు. ఈ విషయంపై కేంద్రప్రభుత్వం.. 2019 ఏప్రిల్ లో రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు. 

అయితే ఇదే పౌరసత్వ సమస్యపై రాహుల్ గాంధీని 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలన్న అభ్యర్థనను మే 2019లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఒక డాక్యుమెంట్ లో అతన్ని బ్రిటిష్ అని పేర్కొన్నంత మాత్రాన అది స్వయంచాలకంగా అతన్ని బ్రిటిష్ పౌరుడిగా మారుస్తుందా?  అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ మునుపటి తీర్పులు ఉన్నప్పటికీ..ఈ విషయం సమగ్ర విచారణకు అర్హమైనది అని స్వామి మొండిగా ఉన్నారు. ఐదేళ్లుగా ప్రభుత్వం జాప్యం చేసిందని సుబ్రమణ్య స్వామి తన పిటిషన్ లో తెలిపారు. 

తన ఫిర్యాదుపై ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకోవాలని, ఈ అంశంపై తుది ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని సుబ్రమణ్య స్వామి కోర్టును తన న్యాయవాది సత్య సబర్వాల్ ద్వారా సమర్పించిన ఫిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ వచ్చే వారం కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.