సంగారెడ్డి జిల్లాలో బీసీలకు సబ్సిడీ లోన్లు ఇస్తలేరు

సంగారెడ్డి జిల్లాలో బీసీలకు సబ్సిడీ లోన్లు ఇస్తలేరు

సంగారెడ్డి, వెలుగు :  సంగారెడ్డి జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ తరఫున ఇచ్చే లోన్లు ఇస్తలేరు. నిరుద్యోగ యువత కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సబ్సిడీ రుణాల పంపిణీ అటకెక్కింది. నాలుగేళ్ల కింద మొదలు పెట్టిన ఈ సబ్సిడీ లోన్ల పంపిణీపై మొదట్లో ఆర్భాటం చేసిన ప్రభుత్వం క్రమేణా వాటి గురించి పట్టించుకోవడం మరిచింది. సబ్సిడీతో కూడిన లోన్లు వస్తాయి.. ఇక తమ బతుకులు బాగు పడతాయనుకున్న నిరుద్యోగుల ఆశలు ఆవిరవుతున్నాయి. జిల్లాలో ఉన్న 26 మండలాలు, 8 మున్సిపాలిటీల పరిధిలో బ్యాంకర్లు, బీసీ కార్పొరేషన్ అధికారులు నిరుద్యోగులకు అప్పట్లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. కొంతమంది లబ్ధిదారులను ఎంపిక చేసి లోన్లు ఇవ్వడం మరిచిపోగా మిగతా లబ్ధిదారుల ఎంపికను పూర్తిగా వదిలిపెట్టారని బాధితులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో పరిస్థితి ఇదీ.. 

సబ్సిడీ లోన్ల కోసం బీసీ నిరుద్యోగులు, చిరు వ్యాపారుల నుంచి 2017-–18లో ఆన్ లైన్ పద్ధతిలో బీసీ కార్పొరేషన్ ద్వారా మూడు కేటగిరీలలో దరఖాస్తులు స్వీకరించింది. రుణ లక్ష్యం రూ.217.59 కోట్లు నిర్ణయించగా, స్వీకరించిన దరఖాస్తుల్లో 10,096 మంది లబ్ధిదారులను గుర్తించారు. మొదటి కేటగిరిలో 100 శాతం సబ్సిడీ కింద రూ.50 వేల నుంచి లక్ష వరకు రుణాల కోసం 900 మందిని ఎంపిక చేసి 766 మందికి రూ.3.83 కోట్లు మంజూరు చేశారు. రెండో కేటగిరిలో 80 శాతం సబ్సిడీ కింద 4,321 మందికి రూ.2 లక్షల లోపు రుణాలు ఇవ్వాలని నిర్ణయించగా ఇందుకు రూ.59.37 కోట్లు పంపిణీ చేయాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. మూడో కేటగిరి కింద రూ.2 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 60 శాతం సబ్సిడీతో లోన్స్ ఇవ్వాలనుకున్నారు. ఇందులో రూ.151.25 కోట్లు కేటాయించి 4,875 మంది లబ్ధిదారులను గుర్తించారు. కానీ ఇప్పటివరకు ఎవరికి లోన్లు ఇయ్యలేదు. ఇతర వర్గాలకు సబ్సిడీ లోన్లు ఇస్తూ కేవలం బీసీ వర్గాలకు ఆపడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఫెడరేషన్ల ద్వారా...

బీసీ ఫెడరేషన్ ద్వారా 2017-–18 ఏడాదికి గాను 5,949 సొసైటీల నుంచి దరఖాస్తులు అందాయి. వీరికి సబ్సిడీ ఇచ్చేందుకు రూ.112.79 కోట్ల అంచనాలు తయారు చేశారు. ఒక్కో ఫెడరేషన్​లో 15 మంది చొప్పున సభ్యులు ఉంటారు. అయితే వాటర్ మెన్ ఫెడరేషన్ ద్వారా 1,213 దరఖాస్తులు రాగా, నాయి బ్రాహ్మణ సొసైటీల ద్వారా 1,186, వడ్డెర సొసైటీలకు సంబంధించిన 243, ఉప్పరి ఫెడరేషన్ ద్వారా 221, వాల్మీకి, బోయ ఫెడరేషన్ల ద్వారా 35 దరఖాస్తులు, పూసల, కృష్ణ బలిజ ఫెడరేషన్ ద్వారా 59, బట్రాజు ఫెడరేషన్ 9, శాలివాహన, కుమ్మరి ఫెడరేషన్ ద్వారా 1,173, గీత ఫెడరేషన్ 1,124, మేదరి ఫెడరేషన్ ద్వారా 61 దరఖాస్తులు అందాయి. వీటిలో ఏ ఒక్క సొసైటీకి లోన్లు ఇచ్చింది లేదు. దీంతో సబ్సిడీ రుణాలకు ఎంపికైన ఆయా ఫెడరేషన్లు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నాయి.--------------