
దేశ వ్యాప్తంగా టమాటా రేట్లు మండిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో కిలో టమాటా రూ. 200 వరకు పలుకుతోంది. టమాటాల రేట్లు పెరగడంతో దేశంలోని కొన్ని సబ్ వే అవుట్ లెట్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై శాండ్ విచ్ లు, సలాడ్ లు, ఇతర వంటకాల్లో టమాటాలు లేకుండా కస్టమర్లకు సరఫరా చేయనున్నాయి.
ఢిల్లీ ఎయిర్ పోర్టులోని ఓ సబ్ వే అవుట్ లెట్ ఈ మేరకు ఒక నోటీసులు రెస్టారెంట్ ముందు ఏర్పాటు చేసింది. అదేంటంటే..
మేము మీకు నచ్చిన పదార్ధాలతో నచ్చిన ఆహారాన్ని అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము. అయితే ప్రస్తుతం టమటాలో ధరలు విపరీతంగా పెరిగిన కారణంగా ఆహార పదార్థాలలో టమాటాలను అందించలేకపోతున్నాం. మేము టమోటాలను అతి త్వరలో వంటకాల్లో ఉపయోగించేందుకు ప్రయత్నిస్తాం...అని నోటీసులో పేర్కొంది.
ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే కాకుండా ఢిల్లీలోని రెండు సబ్ వే ఔట్‌లెట్‌లు, ఉత్తరప్రదేశ్‌లో ఓ సబ్ వే, చెన్నైలోని ఓ సబ్ వే కూడా తమ వంటలలో టమోటాలను వేయడం లేదు. అయితే ప్రస్తుతం టమాటా ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో సబ్ వే యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సబ్వే స్టోర్ ఉద్యోగి తెలియజేశాడు.