దోమలంటేనే మలేరియా, చికెన్ గున్యా, డెంగీ లాంటి రోగాలు గుర్తొస్తాయి. వాటి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది చనిపోతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనైతే ప్రపంచంలో ‘ప్రాణాంతక ప్రాణులు’ దోమలే అంటోంది. ఇలాంటి రాక్షస దోమలను చైనాలోని రెండు ద్వీపాల నుంచి తరిమి తరిమికొట్టారు. అక్కడ అసలు దోమలే లేకుండా చేశారు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సైన్స్ ఈ మధ్యే వెల్లడించింది.
దోమల ఫ్యాక్టరీ
చైనాలో జనాలు ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతం గ్వాంజోవ్. ఆ ఉష్ణమండల ప్రాంతం జనాలు 2014లో 37,350 మంది డెంగీతో నరకం చూశారు. దీంతో రోగాలకు కారణమయ్యే ఆడ ఆసియా టైగర్ దోమల భరతం పట్టాలని చైనా డిసైడయింది. వాటి సంఖ్యను తగ్గించేందుకు ట్రయల్స్ స్టార్ట్ చేసింది. ఇందుకోసం దక్షిణ చైనాలో ఓ దోమల ఫ్యాక్టరీనే రెడీ చేశారు. అక్కడ స్టెరిలైజ్ చేసిన (సంతానం కలగకుండా చేయడం) మగ దోమలను సృష్టించేవారు. అవి ఆడ దోమలతో కలిసినా సంతానం పెరగదు. ఈ ప్రయోగంతో దక్షిణ చైనాలోని గువాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని రెండు దీవుల్లో దోమల సంఖ్య చాలావరకు తగ్గింది. దీంతో వాటిని పూర్తిగా తగ్గించాలని సైంటిస్టులు డిసైడయ్యారు. మరో కొత్త ప్రయోగాన్ని చేశారు. మగ దోమలతో పాటు ఈసారి ఆడ వాటినీ టార్గెట్ చేశారు. ఆడ దోమలను తక్కువ లెవల్ రేడియేషన్‌తో స్టెరిలైజ్ చేసి మగ దోమల్లోకి వుల్బాషియా బ్యాక్టీరియాతో ప్రవేశపెట్టారు. సంతానం ఎక్కువగా ఉత్పత్తి అయ్యే నెలల్లో వీటిని బయటకు వదిలారు. 2016, 2017ల్లో వరుసగా గ్వాంజోవ్ సిటీకి దగ్గర్లోని రెండు ద్వీపాల్లో ట్రయల్స్ చేయగా దోమల సంఖ్య 94% తగ్గింది. దోమలు కుట్టడమూ 97% తగ్గింది. ఇంతకుముందు 2018లో ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన సైంటిస్టులు జీన్ ఎడిటింగ్ ద్వారా దోమల సంఖ్య పెరగకుండా ప్రయత్నం చేశారు.
దోమల్ని తగ్గించడమే పరిష్కారం
దోమల విజృంభణ ప్రపంచవ్యాప్తంగా ఏమాత్రం తగ్గలేదు. ఫిలిప్పీన్స్‌లో ఈ ఏడాది తొలినాళ్లలోనే 450 మంది డెంగీతో చనిపోయారు. దీంతో జులైలో అక్కడ ‘నేషనల్ డెంగీ అలర్ట్’ను ప్రకటించారు. దీంతో దోమల సంఖ్యను తగ్గించడమే సరైన పరిష్కారమని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సైన్స్ చెప్పింది. ఆడ ఆసియా టైగర్ దోమలు 40 ఏళ్లలో ఆసియా నుంచి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని సైంటిస్టులు చెప్పారు. దోమలను చంపే మందులు వాడటం, తెరిచిన డబ్బాల్లో, డ్రైనేజీల్లో నీరు నిల్వ ఉండకుండా చూడటం లాంటి పద్ధతులతో అది కష్టమని, అందుకే కొత్తరకం పద్ధతులను స్టార్ట్ చేశామని అన్నారు.
