
- కర్ణాటకలో వెలుగు చూసిన ఘటన
- కర్ణాటక నుంచి మహారాష్ట్రకు తీర్థయాత్రకు వెళ్లిన వ్యక్తి
- గ్రామంలోని కుక్క అతడినే అనుసరిస్తూ వెళ్లిన వైనం
- మహారాష్ట్రలో తప్పిపోయిన కుక్క
- కొన్ని రోజులకు కర్ణాటకలో యజమాని వద్దకు చేరిన వైనం
కర్ణాటక రాష్ట్రంలోని బెలగావి జిల్లా నిపాని తాలూకా యమగర్ని గ్రామంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఇటీవల తీర్థయాత్రలకు వెళ్లిన యజమానిని ఫాలో అయి వెళ్లిన ఓ కుక్క అక్కడ తప్పిపోయింది. అలా తప్పిపోయిన కుక్క చివరకు 250 కిలోమీటర్లు ప్రయాణించి యజమాని ఇంటికి చేరుకుంది. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యా్ప్తంగా వైరల్‌గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర కర్ణాటకలోని బెళగావి జిల్లా యమగర్ని గ్రామానికి చెందిన కమలేశ్ కుంభర్ ప్రతి యేటా మహారాష్ట్రలోని పంధర్‌పూర్ విఠోబా గుడికి పాదయాత్రగా వెళ్తుంటారు. ఈ ఏడాది కూడా జూన్ చివరి వారంలో కమలేశ్ యాత్రకు వెళ్లగా కుక్క కూడా తనను ఫాలో అవుతూ వెళ్లింది. దాదాపు 250 కిలోమీటర్లు ఆ కుక్క కమలేశ్ ను ఫాలో అయింది. పుణ్యక్షేత్రానికి చేరుకున్న అనంతరం విఠోబా గుడిలో దర్శనం చేసుకుని బయటకు వచ్చిన కమలేశ్‌కు కుక్క కనిపించలేదు.
చుట్టుపక్కల వారిని ఆరా తీయగా మరో భక్తజన బృందంతో వెళ్లిందని వారు చెప్పారు. కాసేపే ఆ శునకం కోసం కమలేశ్ వెతికినా కనిపించకపోయేసరికి ఆయన ఇంటికి తిరిగొచ్చేశారు. అయితే జులై 14న ఆ శునకం కమలేశ్ ఇంటిముందు ప్రత్యక్షమవడంతో ఆయన ఒకింత షాక్ కు గురయ్యాడు. అనంతరం ఆ విషయాన్ని ఊరంతా చెప్పి సంబరాలు చేసుకున్నాడు కమలేశ్.
అలా 250 కిలో మీటర్లు ఒంటరిగా నడుచుకుంటూ వచ్చిన కుక్కను చూసి గ్రామస్థులందరూ ఆశ్యర్యానికి లోనవుతూ సంబరాల్లో పాల్గొన్నారు. కాగా ఆ కుక్క పేరు మహరాజ్ అని, దానికి భజనలు వినడమంటే ఇష్టమని కమలేశ్ చెప్పాడు. గతంలోనూ తన వెంట కొన్ని పాదయాత్రలకు కుక్క వచ్చిందని తెలిపాడు. తన మహరాజ్ మళ్లీ తమ గ్రామానికి తిరిగొచ్చిన నేపథ్యంలో గ్రామస్థులకు కమలేశ్ విందు కూడా ఏర్పాటు చేశాడు.