బాధ్యులపై చర్యలు తీస్కోవాల్సిందే: సివిల్స్ అభ్యర్థులు

బాధ్యులపై చర్యలు తీస్కోవాల్సిందే: సివిల్స్ అభ్యర్థులు
  • ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనపై మూడో రోజు సివిల్స్ అభ్యర్థుల ఆందోళన
  • బాధిత కుటుంబాలకు పరిహారం ఇప్పించాలని డిమాండ్

న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్  రాజేంద్ర నగర్  రావూస్  ఐఏఎస్  స్టడీ సర్కిల్ బేస్ మెంట్ లో వరద నీరు చేరి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు చనిపోయిన ఘటనపై మూడో రోజు మంగళవారం కూడా అభ్యర్థులు ధర్నా చేశారు. అభ్యర్థుల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్  చేశారు. ఎంసీడీ, రావూస్  ఐఏఎస్ స్టడీ సర్కిల్  మేనేజ్ మెంట్ కు వ్యతిరేకంగా  ఆందోళన చేశారు.  

కోచింగ్  సెంటర్లు రూల్స్  పాటించకుండా తమ ప్రాణాలను రిస్కులో పెడ్తున్నాయని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు రావూస్  స్టడీ సర్కిల్ తో పరిహారం ఇప్పించాలన్నారు. ‘‘మా డిమాండ్లు తీర్చే వరకూ ఆందోళన విరమించం” అని అభ్యర్థులు స్పష్టం చేశారు. అభ్యర్థుల ఆందోళనకు స్థానికులు కూడా సంఘీభావం తెలిపారు. కాగా, ప్రీతివిహార్ లో బేస్ మెంట్లలో  నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లను ఎంసీడీ అధికారులు సీజ్  చేశారు.

ఢిల్లీ సర్కారు, ఎంసీడీకి ఎన్ హెచ్ఆర్ సీ నోటీసులు

రావూస్  స్టడీ సర్కిల్  దుర్ఘటనపై ఢిల్లీ సర్కారు, సిటీ పోలీసు, ఎంసీడీ కమిషనర్ కు జాతీయ మానవ హక్కుల సంఘం  నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.  కాగా, ఢిల్లీ ఘటన నేపథ్యంలో సెల్లార్లలో నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్ల మూసివేయాలంటూ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులను ఆదేశించాయి.