బీఆర్ఎస్ చేసిన అప్పులు కడుతున్నం : సుదర్శన్రెడ్డి

బీఆర్ఎస్ చేసిన అప్పులు కడుతున్నం : సుదర్శన్రెడ్డి
  • సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే కేసీఆర్​ నాశనం చేసిండు
  • నిజాంషుగర్ ఫ్యాక్టరీ బాకీ రూ.200 కోట్లు చెల్లించాం
  • ధాన్యం డబ్బులు 24 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ
  • ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్​రెడ్డి 

నిజామాబాద్‌‌‌‌, వెలుగు :  బీఆఎర్ఎస్​ గవర్నమెంట్ చేసిన రూ.లక్షల కోట్ల అప్పులకు కాంగ్రెస్​ సర్కార్ వడ్డీలు, కిస్తులు కడుతూ ప్రజలకిచ్చిన హామీలు నెరవేరుస్తోందని ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్​రెడ్డి అన్నారు. గురువారం సన్మాన సభలో టీపీసీసీ చీఫ్ మహేశ్​కుమార్ గౌడ్‌‌‌‌తో కలిసి పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రజలను నమ్మించి అప్పులతో పదేండ్లు అధికారంలో కొనసాగిన కేసీఆర్ పబ్బం గడిపారే తప్పా జిల్లాకు ఏమిచ్చారని ప్రశ్నించారు. ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని కోరారు. 

లోకల్​ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడొచ్చినా కాంగ్రెస్​ను గెలిపించి సీఎం రేవంత్​రెడ్డి నాయకత్వాన్ని బలపర్చాలన్నారు. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేయడానికి కాంగ్రెస్​ ప్రభుత్వం రూ.200 కోట్ల బాకీలు కట్టిందని తెలిపారు. రైతులు చెరకు సాగు చేయడానికి రెడీ కాకపోవడంతో ఆలస్యం అవుతోందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో రూ.21 కోట్లతో వాష్​రూమ్స్ నిర్మించబోతున్నామని, సర్కార్ హాస్పిటల్స్ నిర్లక్ష్యాన్ని సెట్ చేస్తానని, తనకప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానన్నారు. కులమతాలు అంటగట్టి రాజకీయాలు చేయడం సరికాదన్నారు.   

48 గంటల్లో వడ్ల పేమెంట్..

వడ్ల దిగుబడిలో తెలంగాణ దేశంలో నంబర్ వన్​ స్థానంలో ఉందని గవర్నమెంట్ సలహాదారుడు షబ్బీర్​అలీ అన్నారు. వడ్లు తోలిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్న ఘనత సీఎం రేవంత్​రెడ్డికి దక్కుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం, ఫ్రీ బస్​, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ.500 గ్యాస్​ సిలిండర్ వంటి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయన్నారు.  కరీంనగర్ సభలో తెలంగాణ ఇస్తామని ప్రకటించిన సోనియాగాంధీ మాట నిటబెట్టుకుందన్నారు.  

సోనియాగాంధీ  లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని,  రాష్ట్రం ఇస్తే  కేసీఆర్ నాశనం చేశారని విమర్శించారు. కార్పొరేషన్​ చైర్మన్​లు ఈరవత్రీ అనీల్, అన్వేష్​రెడ్డి, మార్కెట్ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, గ్రంథాలయం చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి, ఆర్మూర్, బాల్కొండ ఇన్​చార్జీలు పొద్దుటూరి వినయ్​రెడ్డి, ముత్యాల సునీల్​రెడ్డి, ఏబీచిన్నా, శేఖర్​గౌడ్​ తదితరులు ఉన్నారు.

సుదర్శన్​రెడ్డికి ఘన స్వాగతం

గవర్నమెంట్ సలహాదారుడుగా అపాయింట్ అయ్యాక, మొదటిసారి ఇందూరుకు వచ్చిన  బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గురువారం మధ్యాహ్నం, నగర శివారులోని ఇందల్వాయి టోల్‌‌‌‌గేట్ వద్ద ఆయనకు వెల్కమ్ చెప్పిన పార్టీ శ్రేణులు, మాధవ్‌‌‌‌నగర్ సాయిబాబా టెంపుల్ వద్ద ఓపెన్‌‌‌‌ టాప్ జీప్‌‌‌‌పై ఎక్కించి ర్యాలీ నిర్వహించారు. సుదర్శన్ రెడ్డితో పాటు మరో సలహాదారుడు షబ్బీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తదితరులు జీప్ పై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. 

చౌరస్తాల్లో పటాకులు కాలుస్తూ, బ్యాండ్ మేళాలతో పార్టీ శ్రేణులు సందడి చేశారు. ర్యాలీ పాత కలెక్టరేట్ గ్రౌండ్ చేరాక, సుదర్శన్ రెడ్డి సన్మాన సభ కొనసాగించారు. జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన లీడర్లు, కార్యకర్తలు ఆయన్ను శాలువా, పులదండలు, బొకేలు, జ్ఞాపికలతో ముంచెత్తారు.  సుదర్శన్ రెడ్డి రాక సందర్భంగా, నగరంలోని ప్రధాన రోడ్లు ఆయన స్వాగత ఫ్లెక్సీలతో  నిండిపోయాయి.