
చౌటుప్పల్, వెలుగు: భార్య పెట్రోల్పోసుకుని నిప్పంటించుకోవడంతో తట్టుకోలేక భర్త సైతం సూసైడ్ చేసుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన పిసాటి మారారెడ్డి(65), మల్లమ్మ(60) దంపతులకు ఇద్దరు కొడుకులు. ఇద్దరికీ వివాహాలు అయ్యాయి. హైదరాబాద్లో ఉంటున్నారు. పెద్దకొడుకు బాల్రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా, చిన్న కొడుకు స్థానికంగానే ఉన్న కెమికల్ కంపెనీలో పని చేస్తున్నాడు. వృద్ధ దంపతులిద్దరు స్వగ్రామంలోనే వ్యవసాయం చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. మారారెడ్డి బుధవారం మండలంలోని లింగారెడ్డిగూడెంలోని బంధువుల ఇంటికి ఫంక్షన్కు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాడు. కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఊరి నుంచి వచ్చాక కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. రాత్రి10.30 గంటల సమయంలో మల్లమ్మ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటల ధాటికి ఇరుగు పొరుగు వచ్చేసరికే మల్లమ్మ మృతి చెందింది. అక్కడి నుంచి అదే రాత్రి వెళ్లిపోయిన మారారెడ్డి పొలంలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. కొడుకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.