ఇకపై, ఏటేటా వేడి రికార్డులే!

ఇకపై, ఏటేటా వేడి రికార్డులే!

ఎండాకాలం పోయి ఇంకా పదిహేను రోజులు కూడా కాలేదు కదా. మార్చి నుంచి మే వరకు సూర్యుడు ప్రతాపం చూపించాడు. బయటికెళ్లకుండా భగ్గుమనిపించాడు. వేడి, ఉక్కతో ఉక్కిరిబిక్కిరయ్యాం. ఇది ఇక్కడితో ఆగిపోదట. ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచంలోని దాదాపు సగం దేశాల్లో ఏటేటా రికార్డు టెంపరేచర్లు నమోదవుతూనే ఉంటాయట. 2100 నాటికి ఏటేటా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటాయట. ‘పారిస్‌‌ ఒప్పందం’ పాటిస్తూ గ్రీన్‌‌హౌజ్‌‌ వాయువులను తగ్గిస్తేనే ఈ పరిస్థితి నుంచి బయటపడతామంట. ఈ వివరాలను ‘నైస్‌‌లీ ఇల్లస్ట్రేట్స్‌‌ ద పేస్‌‌ ఆఫ్‌‌ చేంజ్‌‌’ సర్వే వెల్లడించింది. పారిస్‌‌ డీల్‌‌ను పాటిస్తే ఎలాంటి టెంపరేచర్లు రికార్డవుతాయో, లేదంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో క్లైమేట్‌‌ మోడల్స్‌‌ ద్వారా అంచనా వేసి సర్వేలో వివరించింది సంస్థ.

ఏటా 0.5 డిగ్రీలు

ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌‌హౌజ్‌‌ వాయువులు ఇలాగే పెరుగుతూ పోతే మున్ముందు ఉష్ణోగ్రతలు ఏటా 0.5 డిగ్రీలు పెరుగుతూ ఉంటాయని, 2100 నాటికి ప్రతి ఏడాది ఒక నెలలో 58 శాతం ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించింది. అదే పారిస్‌‌ ఒప్పందాన్ని పాటిస్తే మున్ముందు ప్రపంచంలోని 3 శాతం ప్రాంతాల్లోనే ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఉంటుందని,  2100 నాటికి 14 శాతం ప్రాంతాల్లోనే ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది. ఇప్పటి నుంచే గ్లోబల్‌‌ వార్మింగ్‌‌ తగ్గిస్తూ వచ్చినా మరో 20 ఏళ్ల వరకు ఆగాల్సిందేనని, అప్పటివరకు వేడి తిప్పలు తప్పవని వివరించింది.

బ్రేకింగ్‌‌, సెట్టింగ్‌‌ వేర్వేరు

‘రికార్డు బ్రేకింగ్‌‌’కు, ‘రికార్డు సెట్టింగ్‌‌’కు తేడా ఉందని సర్వేలో పాల్గొన్న పరిశోధకులు చెప్పారు. చరిత్ర సగటును టెంపరేచర్లు దాటితే రికార్డు సెట్టింగ్‌‌ అని, మళ్లీ ఇవే ఉష్ణోగ్రతలు రిపీటైతే రికార్డు బ్రేకింగని వివరించారు. గ్లోబల్‌‌ వార్మింగ్‌‌ పెరుగుతూ పోతే 21వ శతాబ్దంలో ఉష్ణమండల ప్రాంతాల్లో రికార్డు సెట్టింగ్‌‌ ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని చెప్పారు. ప్రపంచంలోని మూడో వంతు తక్కువ ఆదాయ దేశాల్లో టెంపరేచర్లు ఊహించని స్థాయిలో పెరుగుతాయన్నారు. ఏదేమైనా గ్రీన్‌‌హౌజ్‌‌ వాయువులను తగ్గిస్తేనే మనకు, భూమికి మంచిదని, లేదంటే వేడి, ఉక్కతో నరకం తప్పదని హెచ్చరిస్తున్నారు.