సింగరేణి ఓసీ గనులు భగభగమంటున్నాయి

 సింగరేణి ఓసీ గనులు భగభగమంటున్నాయి

​భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రోజురోజుకు ఎండలు మండుతున్నాయి. దీంతో సింగరేణి ఓసీ గనులు భగభగమంటున్నాయి. పెరుగుతున్న టెంపరేచర్​తో కార్మికులు తల్లడిల్లుతున్నారు. బొగ్గు ఉత్పత్తి చేస్తున్న టైంలో ఓవైపు అధిక ఎండవేడి మరోవైపు కింది నుంచి వచ్చే వేడితో సింగరేణి కార్మికులు వడదెబ్బకు గురవుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఫస్ట్, సెకండ్ షిఫ్ట్​ టైమింగ్స్​మార్చాలని కార్మికులు కోరుతున్నారు. అయితే యాజమాన్యం మాత్రం స్పందించడంలేదని వారు వాపోతున్నారు. ఏప్రిల్ లోనే ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఇలాగే కొనసాగితే వచ్చే మే నెలలో డ్యూటీలు చేయలేమని కార్మికులు అభప్రాయపడుతున్నారు. ఓసీ గనుల్లో ఏసీ రెస్ట్​షెల్టర్స్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదనే కార్మికులు ఆరోపిస్తున్నారు. 

ఈ రెండు నెలలే కీలకం...

సింగరేణి వ్యాప్తంగా దాదాపు18 ఓపెన్​కాస్టు గనులున్నాయి. బొగ్గు ఉత్పత్తిలో ఇవే కీలకం. జూన్​ నుంచి ఆగస్టు వరకు వర్షాలు కురుస్తుంటాయి. దీంతో ఆ టైంలో బొగ్గు ఉత్పత్తికి తరుచూ బ్రేక్ పడుతుంది. ఈ క్రమంలో ఏప్రిల్, మే నెలల్లోనే అధికంగా బొగ్గు ఉత్పత్తి చేయాలని యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంటుంది. ప్రధానంగా ఓసీ గనుల్లో వీలున్న మేర అధికంగా బొగ్గును తవ్వే విధంగా యాజమాన్యం ప్లాన్ చేసింది. 

మారని షిఫ్ట్​టైమింగ్స్...

ఇదిలా ఉండగా ఓసీ​ గనుల్లో బొగ్గు తవ్వకాలతో వస్తున్న వేడి ఓవైపు, పై నుంచి సూర్యుడి ఎండ వేడిమితో మరో వైపు కార్మికులు అల్లాడుతున్నారు. క్లోజ్​చేసిన అండర్ ​గ్రౌండ్​లను కొన్ని ప్రాంతాల్లో ఓసీ గనులుగా మార్చారు. అటువంటి ప్రాంతంలో భూ గర్భం నుంచి వస్తున్న వేడితో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. వీటిల్లో దాదాపు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ప్రస్తుతం నమోదవుతున్నాయి. ఇది ఇలానే కొనసాగితే మే నెలలో పనిచేయలేని పరిస్థితి నెలకొంటుంది. ఓసీ ​గనుల్లో బ్లాస్టింగ్ ​చేసే కార్మికుల అవస్థలు వర్ణణాతీతం. మండు టెండల్లో పనిచేయాల్సి ఉంటుంది. కొత్తగూడెం ఏరియాలోని బ్లాస్టింగ్​విభాగంలో పనిచేసే ఓ కార్మికుడు మూడు రోజుల కింద వడదెబ్బకు గురయ్యాడు. కంపెనీ ఏసీ రెస్ట్ షెల్టర్స్​ఏర్పాటు చేయలేకపోయింది. కంపెనీలో ఎక్కువగా చెక్ పోస్టులు ఐరన్​తో చేసినవే కావడంతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడ గాలులతో సెక్యూరిటీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్క్ షాప్ కార్మికుల్లో చాలామంది బయటకు వెళ్లి పని చేయాల్సి ఉంది. కాగా ఓసీ గనుల్లో పనిచేసే వారికి మాత్రమే యాజమాన్యం మజ్జిగను పంపిణీ చేస్తోంది. ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతోంది. సెక్యూరిటీ గార్డులతోపాటు వర్క్ షాప్ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లను అందించడంలేదు. మరో వైపు డ్యూటీ షిఫ్ట్​టైమింగ్స్​ మార్చాలని కార్మికులతోపాటు సంఘాల నేతలు డిమాండ్ ​చేస్తున్నారు. మార్నింగ్ ​షిఫ్ట్​ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు, సెకండ్ షిఫ్ట్ మధ్యాహ్నం3నుంచి11 గంటల వరకు ఉన్న టైమింగ్స్​ను మార్చాలని కార్మికులు కోరుతున్నారు. మార్నింగ్​ షిఫ్ట్ ఉదయం 6 నుంచి12 గంటల వరకు, సెకండ్ షిఫ్ట్​మధ్యాహ్నం 4 నుంచి11 గంటల వరకు మార్చాలని సంఘాల నేతలు కోరుతున్నారు. ఫస్ట్​షిఫ్ట్​లో పనిచేసి ఇంటికి వెళ్లే టైం, సెకండ్​షిఫ్ట్​లో డ్యూటీ చేసేందుకు  మండుటెండల్లో వెళ్లాల్సి వస్తుండడంతో కార్మికులు వడదెబ్బతోపాటు అనారోగ్యానికి గురవుతారని యూనియన్ల నేతలు పేర్కొంటున్నారు.

షిఫ్ట్​ టైమింగ్స్ మార్చాలె..

గనుల్లో ఎండలు మండిపోతున్నయ్. ఎక్కువ వేడితో కార్మికులు అనారోగ్యం పాలవుతున్నరు. ఫస్ట్, సెకండ్​షిఫ్ట్​ల టైమింగ్స్ మార్చే విధంగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలె. మజ్జిగ ఒక ప్యాకెట్​కాకుండా కనీసం రెండు ఇవ్వాలె. 
- వంగా వెంకట్, వర్కర్స్​యూనియన్ సెంట్రల్​ఆర్గనైజింగ్​సెక్రెటరీ

ఏసీ రెస్ట్ షెల్టర్స్​ఏర్పాటు చేయాలె..

ఎండల వేడి పెరుగుతుండడంతో సింగరేణి కార్మికులు వడదెబ్బకు గురవుతున్నరు. ఓపెన్ కాస్ట్​గనుల్లో ఏసీ రెస్ట్​షెల్టర్స్​ను ఏర్పాటు చేయాలె. మజ్జిగ ప్యాకెట్లు ప్రతి కార్మికుడికి అందించాలె. రోడ్లపై వాటర్ స్ప్రే ఎప్పటికప్పుడు చేయాలె. దుమ్ము లేవకుండా చూడాలె.  
- ఎం.ప్రభాకర్​రావు, కోల్ మైన్స్​కార్మిక సంఘ్​ఉపాధ్యక్షుడు