కోల్ కతాపై రైజర్స్ సూపర్ విక్టరీ

 కోల్ కతాపై రైజర్స్ సూపర్ విక్టరీ
  • దంచికొట్టిన త్రిపాఠి, మార్ క్రమ్

ముంబై: వరుసగా రెండు ఓటములతో కొత్త సీజన్‌‌‌‌ను మొదలు పెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్​ తర్వాత అనూహ్యంగా దూసుకెళ్తోంది. లీగ్‌‌లో వరుసగా మూడో విజయం సాధించి హ్యాట్రిక్‌‌ కొట్టింది. రాహుల్ త్రిపాఠి (37 బాల్స్ లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 71), మార్ క్రమ్ (36 బాల్స్ లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 నాటౌట్) ఫిఫ్టీలతో విజృంభించడంతో  శుక్రవారం జరిగిన మ్యాచ్ లో 7 వికెట్లతో కోల్‌‌కతా నైట్ రైడర్స్‌‌ను చిత్తు చేసింది.  టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా.. 20 ఓవర్లలో 175/8 స్కోరు చేసింది.  నితీశ్ రాణా (36 బాల్స్ లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 54) ఫిఫ్టీ కొట్టగా.. ఆండ్రీ రసెల్ (25 బాల్స్ లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 49 నాటౌట్) చివర్లో దంచాడు. నటరాజన్ (3/37), ఉమ్రన్ (2/27) రాణించారు. అనంతరం ఛేజింగ్ లో త్రిపాఠి, మార్ క్రమ్ మెరుపులతో హైదరాబాద్ 17.5 ఓవర్లలోనే 176/3 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. కోల్ కతా బౌలర్లలో రసెల్ (2/20) రెండు వికెట్లు తీశాడు.  త్రిపాఠికి ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది. 

ఆదుకున్న రాణా, రసెల్

సన్ రైజర్స్ బౌలర్ల సూపర్ పెర్ఫామెన్స్ తో కోల్‌‌కతాకు సరైన ఆరంభం లభించలేదు. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఆరోన్‌‌ ఫించ్(7)రెండో ఓవర్లోనే ఔటయ్యాడు. మరో ఓపెనర్​  వెంకటేశ్ అయ్యర్(6)తో పాటు నరైన్ (6)ను ఐదో ఓవర్లో నటరాజన్ పెవిలియన్ చేర్చడంతో 31/3తో కేకేఆర్ కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (28), నితీశ్ రాణా టీమ్​ను ఆదుకున్నారు. జాగ్రత్తగా ఆడుతూనే వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలతో స్కోరును ముందుకు తీసుకెళ్లారు. పదో ఓవర్ చివరి బాల్ కు శ్రేయస్ ను ఉమ్రన్ క్లీన్ బౌల్డ్ చేయడంతో సగం ఓవర్లు ముగిసేసరికి కోల్ కతా 70/4తో నిలిచింది. 12వ ఓవర్లో గేర్ మార్చిన రాణా 6,4తో పాటు ఉమ్రన్ వేసిన తర్వాతి ఓవర్లో ఓ సిక్స్ బాదాడు. ఇదే ఓవర్లో సిక్స్​ కొట్టిన షెల్డన్ జాక్సన్ (7) ఔటైనా రాణా దూకుడు కొనసాగించాడు. మరో ఎండ్​లో అతనికి  తోడైన రసెల్ ఎదుర్కొన్న మూడో బాల్‌‌నే సిక్స్‌‌ గా మలిచాడు. 15వ ఓవర్లో ఓ ఫోర్, సింగిల్ తో రాణా ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 17వ ఓవర్లో 4,6,4తో రసెల్ 16 రన్స్ పిండుకున్నాడు. ఆపై వరుస ఓవర్లలో రాణా, కమిన్స్ (3) అమన్ (5) ఔటైనా.. చివరి ఓవర్లో రసెల్ జోరుతో 17 రన్స్ రావడంతో కేకేఆర్ మంచి స్కోర్ సాధించింది. 

త్రిపాఠి, మార్‌‌క్రమ్‌‌ ఫటాఫట్‌‌

ఛేజింగ్‌‌లో రెండో ఓవర్లోనే సన్ రైజర్స్ కు ఎదురుదెబ్బ తగిలింది. అభిషేక్ (3)ను బౌల్డ్ చేసిన కమిన్స్.. కేకేఆర్ కు బ్రేక్ ఇచ్చాడు. ఆపై రాహుల్ త్రిపాఠి, విలియమ్సన్ (17) వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఆరో ఓవర్లో విలియమ్సన్ ను రసెల్ బౌల్డ్ చేయడంతో పవర్ ప్లేలో 46/2తో హైదరాబాద్ ఇబ్బందుల్లో పడినట్లు కనిపించింది. ఈ దశలో త్రిపాఠి గేర్ మార్చి దూకుడుగా ఆడాడు. 7వ ఓవర్లో 4,6తో పాటు చక్రవర్తి వేసిన 8వ ఓవర్లో 4,6,6తో స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. అతడికి మార్ క్రమ్ సపోర్ట్ ఇచ్చాడు. ఇక 10వ ఓవర్లో మార్ క్రమ్ 6,4తో టచ్ లోకి రాగా.. చివరి బంతికి సింగిల్ తో త్రిపాఠి 21 బాల్స్ లోనే  ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. తర్వాతి ఓవర్ ఫస్ట్ బాల్ కు సిక్స్ బాదిన త్రిపాఠి స్కోర్ ను వంద దాటించాడు. ఆపై రెండు ఓవర్లలో స్కోర్ నెమ్మదించినా.. 14వ ఓవర్లో మార్ క్రమ్ హ్యాట్రిక్ ఫోర్లతో స్పీడు పెంచాడు. రసెల్ వేసిన ఓవర్లో సిక్స్ బాదిన తర్వాతి బంతికే త్రిపాఠి ఔట్ కావడంతో మూడో వికెట్ కు 92 రన్స్ పార్ట్ నర్ షిప్ ముగిసింది. అప్పటికే 30 బాల్స్ లో 36 రన్స్ అవసరం అయ్యాయి. పూరన్‌‌ (5 నాటౌట్‌‌)తో కలిసి టార్గెట్‌‌ కరిగించిన  మార్‌‌క్రమ్..18 ఓవర్లో 4,6,6 బాది మ్యాచ్‌‌ ఫినిష్‌‌ చేశాడు.  

సంక్షిప్త స్కోర్లు

కోల్ కతా: 20 ఓవర్లలో 175/8(రాణా 54, రసెల్ 49 నాటౌట్, నటరాజన్ 3/37, ఉమ్రన్ 2/27)
హైదరాబాద్: 17.5 ఓవర్లలో 176/3 (త్రిపాఠి 71, మార్ క్రమ్ 68 నాటౌట్, రసెల్ 2/20).