జాగ్రత్త : ఎండలు పెరుగుతున్నయ్‌‌

జాగ్రత్త : ఎండలు పెరుగుతున్నయ్‌‌
  •     రాబోయే ఐదు రోజులు 3 డిగ్రీల దాకా పెరిగే చాన్స్‌ 
  •     ఎండలపై అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ 

రాష్ట్రంలో ఎండలు పెరుగుతున్నాయి. శనివారం చాలా ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 21 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డ్‌‌ కాగా, మిగతా జిల్లాల్లో 39 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా బుగ్గబావిగూడ, నిర్మల్ జిల్లాలో 41 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి. రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ శనివారం హెచ్చరించింది.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. శనివారం చాలా ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 21 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డ్‌ కాగా, మిగతా జిల్లాల్లో 39 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా బుగ్గబావిగూడ, నిర్మల్ జిల్లాల్లో 41 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి. 

రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. ప్రస్తుతం రికార్డవుతున్న టెంపరేచర్ల కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎండలపై ఇప్పటికే అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశామని చెప్పింది. హైదరాబాద్‌లోనూ వచ్చే ఐదు రోజులు ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే ఉదయం పూట మాత్రం పొగ మంచు పరిస్థితులు ఉంటాయని తెలిపింది. 

కాగా, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 40.9 డిగ్రీలు, సూర్యాపేట, జోగులాంబ గద్వాల, నిజామాబాద్, జగిత్యాలలో 40.8 డిగ్రీలు, నాగర్ కర్నూల్, వనపర్తి, మేడ్చల్ మల్కాజ్‌గిరి (నాగోల్​) 40.7, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం 40.6, హైదరాబాద్​(బేగంబజార్), మంచిర్యాల, సిద్దిపేట 40.4, మెదక్, ఖమ్మం 40.3, హనుమకొండ 40.2, ములుగు జిల్లాలో 40 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదయ్యాయి. 

ఏప్రిల్‌లో మరింత పెరిగే చాన్స్..​

ఏప్రిల్‌లో టెంపరేచర్లు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఇటీవల ఓ స్టడీ హెచ్చరించింది. హోలీ పండుగ నుంచి ఎండ మంటలు ఎక్కువవుతాయని చెప్పింది. ‘హీట్ ట్రెండ్స్ ఫర్ హోలీ’పేరిట క్లైమేట్ సెంట్రల్ అనే సంస్థ వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఇటీవల ఒక స్టడీ చేసింది. దేశంలో హీట్ వేవ్స్ ట్రెండ్‌ను అంచనా వేసింది. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో ఏప్రిల్ తొలి వారం నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని తెలిపింది. 1970లో రికార్డయిన టెంపరేచర్లు ప్రస్తుతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.