ముంబైపై సన్ రైసర్స్ ఉత్కంఠ విజయం

ముంబైపై సన్ రైసర్స్ ఉత్కంఠ విజయం

ముంబై: సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు మళ్లీ గెలుపు బాట పట్టింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన పోరులో అదరగొట్టింది. మంగళవారం జరిగిన మ్యాచ్​లో రైజర్స్ మూడు రన్స్ తేడాతో ముంబై ఇండియన్స్​ను ఓడించింది.  లీగ్​లో ఆరో విక్టరీతో ప్లేఆఫ్స్​ ఆశలు సజీవంగా నిలుపుకుంది.  టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 193/6 భారీ స్కోరు చేసింది. రాహుల్ త్రిపాఠి (44 బాల్స్ లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 76)తో హాఫ్ సెంచరీతో పాటు ప్రియమ్ గార్గ్ (26 బాల్స్ లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 42) మెరిశాడు. ముంబై బౌలర్లలో రమణ్ దీప్ (3/20) ఆకట్టుకున్నాడు. ఛేజింగ్ లో ఓవర్లన్నీ ఆడిన ముంబై 190/7 స్కోరు చేసి ఓడిపోయింది. రోహిత్ శర్మ (36 బాల్స్ లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతోతో 48), టిమ్ డేవిడ్ (18 బాల్స్ లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో46) మెరుపులు వృథా అయ్యాయి. హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ (3/23) రాణించాడు. త్రిపాఠికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.

త్రిపాఠి, గార్గ్ దూకుడు..

రైజర్స్ మూడో ఓవర్లోనే అభిషేక్ (9) వికెట్ కోల్పోయినా మరో ఓపెనర్ ప్రియమ్ గార్గ్ తో కలిసి రాహుల్ త్రిపాఠి ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఐదో ఓవర్లో రెండో బంతికి ప్రియమ్ క్యాచ్ డ్రాప్ నుంచి తప్పించుకుని బౌలర్లపై ఆధిపత్యం చూపించాడు. కానీ 10వ ఓవర్లో  గార్గ్ ను ఔట్ చేసిన రమణ్ దీప్ రెండో వికెట్ కు 78 రన్స్ పార్ట్ నర్ షిప్ బ్రేక్ చేశాడు. అప్పటికే సగం ఓవర్లలో 97/2తో రైజర్స్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ దశలో త్రిపాఠికి నికోలస్ పూరన్ (38) జత కలిశాడు. 13వ ఓవర్లో 6,6తో టచ్ లోకి వచ్చిన పూరన్ కూడా జోరు చూపించాడు. తర్వాతి ఓవర్లో సింగిల్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న త్రిపాఠి.. 16వ ఓవర్లో 6,4,4తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో 16 ఓవర్లలో 164/2తో ఉన్న హైదరాబాద్ స్కోరు 200 దాటేలా కనిపించింది. కానీ వరుస ఓవర్లలో పూరన్, త్రిపాఠి, మార్ క్రమ్ (2)ను ఔట్ చేసిన ముంబై బౌలర్లు రైజర్స్ జోరుకు బ్రేక్ వేశారు. ఆఖరి రెండు ఓవర్లలో సుందర్ (9) వికెట్ కోల్పోయి 18 రన్స్ చేయడంతో హైదరాబాద్ 200లోపే పరిమితమైంది.  

శుభారంభం దక్కినా..

భారీ టార్గెట్ ఛేజింగ్ లో ఓపెనర్లు రోహిత్ , ఇషాన్ (43) తొలి వికెట్ కు 95 రన్స్ పార్ట్ నర్ షిప్ నెలకొల్పి మంచి పునాది వేశారు. రెండో ఓవర్లోనే లాంగాన్ మీదుగా సిక్స్ తో రోహిత్ టచ్ లో కనిపించగా.. రెండు ఫోర్లతో ఇషాన్ జోరు చూపించాడు. సగం ఓవర్లకు 89/0 స్కోరు చేసిన ముంబై విక్టరీ రేసులోనే ఉంది. కానీ తర్వాత వరుస ఓవర్లలో రోహిత్ ను సుందర్, ఇషాన్ ను ఉమ్రాన్ ఔట్​ చేసి రైజర్స్ కు బ్రేక్ ఇచ్చారు. ఆపై 15వ ఓవర్లో తిలక్ (8), సామ్స్ (15)ను వెనక్కుపంపిన  ఉమ్రాన్ ముంబైని దెబ్బతీశాడు. అప్పటికి ముంబైకి 30 బాల్స్ లో 67 రన్స్ అవసరం. స్టబ్స్ (2) ఔటైనా.. డేవిడ్ బౌండ్రీలతో విరుచుకుపడ్డాడు. నటరాజన్ వేసిన 18వ ఓవర్లో 4 సిక్సర్లు బాది చివరి బంతికి రనౌటయ్యాడు. దీంతో సమీకరణం 12 బాల్స్ లో 19 రన్స్ గా మారింది. కానీ, 19 ఓవర్లో సంజయ్ (0)ను ఔట్ చేసిన భువీ మెయిడిన్ చేయగా.. చివరి ఓవర్లో రమణ్ దీప్ (14 నాటౌట్) 4,6 బాదినా ముంబైకి ఓటమి తప్పలేదు. 

బుమ్రా @ 250 వికెట్లు

టీ20ల్లో బుమ్రా 250 వికెట్ల క్లబ్​లో చేరి, ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్​ పేసర్​గా నిలిచాడు.