కెప్టెన్‌‌ కేన్‌‌, పూరన్‌‌ను వదిలేసిన సన్‌‌రైజర్స్‌‌

 కెప్టెన్‌‌ కేన్‌‌, పూరన్‌‌ను వదిలేసిన సన్‌‌రైజర్స్‌‌

ముంబై:  ఐపీఎల్‌‌లో  కొన్నేళ్లుగా నిరాశ పరుస్తున్న సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌  తమ కెప్టెన్‌‌ కేన్‌‌ విలియమ్సన్‌‌ను వదులుకుంది. 2023 సీజన్‌‌లో జట్టులో  సమూల మార్పులు చేయాలని భావిస్తున్న ఎస్‌‌ఆర్‌‌హెచ్‌‌ ఫ్రాంచైజీ  విలియమ్సన్‌‌, విండీస్ స్టార్‌‌ బ్యాటర్ సహా 12 మంది ప్లేయర్లను రిలీజ్‌‌ చేసింది. మరోవైపు డ్వేన్‌‌ బ్రావోతో సుదీర్ఘ అనుబంధాన్ని సీఎస్‌‌కే తెంచుకోగా, గతేడాది జట్టును నడిపించిన మయాంక్‌‌ అగర్వాల్‌‌ను పంజాబ్‌‌ను వదులుకుంది. ఈ మేరకు 2023 సీజన్‌‌కు సంబంధించిన ప్లేయర్ల రిటెన్షన్‌‌కు తుది గడువు అయిన మంగళవారం పది జట్లు తాము రిటైన్‌‌ చేసుకున్న, రిలీజ్‌‌ చేసిన ఆటగాళ్ల జాబితాలను వెల్లడించాయి.  వీళ్లు వచ్చే నెల 23న కొచ్చిలో జరిగే వేలంలో అందుబాటులోకి రానున్నారు.

ఎనిమిదేళ్లుగా రైజర్స్​తో కేన్​

విలియమ్సన్‌‌ ఎనిమిదేళ్లుగా రైజర్స్‌‌కు ఆడుతున్నాడు. లీగ్​లో 76 మ్యాచ్‌‌ల్లో 2101 రన్స్‌‌ చేసిన అతను 46 మ్యాచ్‌‌ల్లో కెప్టెన్‌‌గా వ్యవహరించాడు. కానీ, అతని కెప్టెన్సీలో గత సీజన్‌‌లో హైదరాబాద్‌‌ 6 మ్యాచ్‌‌ల్లోనే నెగ్గి నిరాశ పరిచింది. దాంతో, ఫారినర్స్​  కేన్‌‌, పూరన్‌‌, రొమారియో షెఫర్డ్‌‌, సీన్‌‌ అబాట్‌‌ సహా మొత్తంగా 12 మందిని వదులుకుంది. తద్వారా వేలానికి హైదరాబాద్​ టీమ్​ వద్ద అత్యధికంగా రూ. 42.25 కోట్లు అందుబాటులో వచ్చింది. ఇండియా స్టార్స్​ భువనేశ్వర్​, టి. నటరాజన్​, ఉమ్రాన్​ మాలిక్​, సుందర్​తో పాటు ఫారినర్స్​ మార్​క్రమ్​, గ్లెన్​ ఫిలిప్స్​, మార్కో జాన్సన్​లను రైజర్స్​ రిటైన్​ చేసుకుంది.

మరోవైపు గత సీజన్‌‌లో పేలవంగా ఆడిన ముంబై ఇండియన్స్‌‌.. కీరన్‌‌ పొలార్డ్‌‌, సామ్స్‌‌, ఉనాద్కట్‌‌, మెరిడిత్‌‌ సహా మొత్తంగా 13 మందిని రిలీజ్‌‌ చేసింది. వీరిలో ఎక్కువగా ఫాస్ట్‌‌ బౌలర్లే ఉన్నారు. పొలార్డ్‌‌ ఐపీఎల్‌‌కు రిటైర్మెంట్‌‌ ఇచ్చాడు. గతేడాది సత్తా చాటిన యంగ్‌‌స్టర్స్‌‌ తిలక్‌‌ వర్మ, బ్రేవిస్‌‌, కార్తికేయలను రిటైన్‌‌ చేసుకుంది. వేలానికి ఆ జట్టుకు రూ. 20.55 కోట్లు అందుబాటులో ఉండగా.. అనుభవం, యువ బలంతో వచ్చే సీజన్‌‌లో బరిలోకి దిగాలని చూస్తోంది. 

కేకేఆర్‌‌కు హ్యాండిచ్చిన కమిన్స్‌‌

కోల్‌‌కతా నైట్‌‌ రైడర్స్‌‌కు ఆస్ట్రేలియా పేస్‌‌ బౌలింగ్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ ప్యాట్‌‌ కమిన్స్‌‌ హ్యాండిచ్చాడు. బిజీ ఇంటర్నేషనల్‌‌ షెడ్యూల్‌‌ దృష్ట్యా ఈ సీజన్‌‌లో ఐపీఎల్‌‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దాంతో, కేకేఆర్‌‌ అతడిని రిలీజ్‌‌ చేసింది. అత్యధికంగా 16 మందిని వదులుకుంది. ఇండియా సీనియర్‌‌ ప్లేయర్‌‌ రహానెతో పాటు ఫించ్‌‌, బిల్లింగ్స్‌‌, నబీ, చమిక కరుణరత్నే, హేల్స్‌‌ ఈ జాబితాలో ఉన్నారు. ట్రేడింగ్‌‌ ద్వారా శార్దూల్‌‌ ఠాకూర్‌‌,  రహ్మనుల్లా గుర్జాబ్‌‌, ఫెర్గూసన్‌‌లను తీసుకున్న కేకేఆర్‌‌ బెంచ్‌‌ బలం నిలబెట్టుకుంది. మిస్టరీ స్పిన్నర్లు నరైన్‌‌, చక్రవర్తితో పాటు రాణా, వెంకటేశ్,  రసెల్‌‌, ఉమేశ్‌‌లను రిటైన్‌‌ చేసుకుంది. ఇక, ఆర్‌‌సీబీ రిలీజ్‌‌ చేసిన ఆరుగురిలో బెరెండార్ఫ్‌‌ ఒక్కడే పెద్ద ప్లేయర్‌‌. డారిల్‌‌ మిచెల్‌‌, జేమ్స్‌‌ నీషమ్‌‌, కరున్‌‌ నాయర్‌‌, కూల్టర్‌‌నైల్‌‌ తదితరులను రిలీజ్‌‌ చేసిన రాజస్తాన్‌‌ రాయల్స్‌‌ కూడా కోర్ టీమ్‌‌ను అలాగే నిలుపుకుంది.  గత సీజన్‌‌ చాంపియన్‌‌ గుజరాత్‌‌ టైటాన్స్‌‌ గుర్బాజ్‌‌, ఫెర్గూసన్‌‌, రాయ్‌‌ సహా ఆరుగురిని వదులుకొని వేలానికి రూ. 19.25 కోట్లు సమకూర్చుకుంది. లక్నో టీమ్‌‌ హోల్డర్‌‌, మనీశ్‌‌ పాండే, దుష్మంత చమీర తదితరులను రిలీజ్‌‌ చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్​ శార్దూల్​, సిఫర్ట్​తో పాటు తెలుగు ఆటగాళ్లు కేఎస్​ భరత్​, అశ్విన్​ హెబ్బర్​లను వదులుకుంది.

బ్రావోతో 11 ఏండ్ల బంధానికి చెన్నై కటిఫ్‌‌

వెస్టిండీస్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ డ్వేన్‌‌ బ్రావోతో  సీఎస్‌‌కే 11 ఏండ్ల బంధం ముగిసింది. 39 ఏళ్ల బ్రావో పాటు ఊతప్ప, మిల్నే, క్రిస్‌‌ జోర్డాన్‌‌లను రిలీజ్‌‌ చేసింది. జడేజానూ వదిలేస్తుందన్న వార్తలు వచ్చినప్పటికీ అతనితో పాటు మిగతా కోర్‌‌ టీమ్‌‌ను అట్టిపెట్టుకుంది. రాయుడు, మొయిన్‌‌ అలీపై మరోసారి నమ్మకం ఉంచింది. కాన్వే, గైక్వాడ్‌‌, తీక్షణ వంటి టాలెంటెడ్‌‌ ప్లేయర్లను కూడా రిటైన్‌‌ చేసుకుంది. ఇక, గత సీజన్‌‌లో కెప్టెన్‌‌గా వ్యవహించిన మయాంక్‌‌తోపాటు ఒడియన్‌‌ స్మిత్‌‌, సందీప్‌‌ శర్మలను పంజాబ్‌‌ కింగ్స్‌‌ వదులుకుంది. బెయిర్‌‌స్టో, భానుక రాజపక్స, లివింగ్‌‌స్టోన్‌‌లను రిటైన్​ చేసుకుంది.