IPL 2026: అభిషేక్–హెడ్ తుఫాన్ బ్యాటింగ్.. పంజాబ్‌ కింగ్స్ టార్గెట్ ఎంతంటే! 

IPL 2026: అభిషేక్–హెడ్ తుఫాన్ బ్యాటింగ్.. పంజాబ్‌ కింగ్స్ టార్గెట్ ఎంతంటే! 

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ పంజా విసిరింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకరమైన బ్యాటింగ్ తో విరుచుకుపడగా, మరోవైపు హెడ్ మాత్రం బౌండరీలు బాదుతూ పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపెట్టాడు. ఈ క్రమంలో అభి ఫాస్టెస్ట్ 50 అందుకున్నాడు. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడీ లెఫ్ట్ హ్యాండర్. అతని దెబ్బకు సన్ రైజర్స్ హైదరాబాద్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో శశాంక్ సింగ్ బౌలింగ్ లో ఈ ఓపెనర్లు ఇద్దరు పెవిలియన్ కి చేరుకున్నారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. కానీ 9వ ఓవర్ వేసిన శాశంక్ సింగ్ బౌలింగ్ లో ఫస్ట్ బంతికే ట్రావిస్ హెడ్ (23 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్సులతో 38 పరుగులు) అవుట్ అయ్యాడు. హాఫ్ సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ (28 బంతుల్లో 5 ఫోర్లు 8 సిక్సులతో 74 పరుగులు)ని కూడా అదే ఓవర్లో శాశంక్ వేసి స్లో బాల్ కి వికెట్ ఇచ్చేసి అభి పెవిలియన్ కి చేరుకున్నాడు. దీంతో ఒకే ఓవర్లో రెండు వికెట్లు నష్టపోయి ఇబ్బందుల్లో పడింది.  

ALSO READ : పంజాబ్ బౌలర్లపై అభిషేక్, హెడ్ దండయాత్ర..

అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్  సన్ రైజర్స్ జట్టు నెట్ రన్ రేట్ తగ్గకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు.. ఈ క్రమంలో అర్షదీప్ బౌలింగ్ లో డీప్ వికెట్ మీదుగా ఆడిన భారీ షాట్ కి బౌండరీ లైన్ దగ్గర మార్కో యాన్సెన్ క్యాచ్ పట్టడంతో ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ ఇషాన్ ( 17 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సుతో 27 పరుగులు) మైదానం వీడాడు. తర్వాత పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో అనికేత్ వర్మ– క్లాసెన్ సుమారు 2 ఓవర్ల పాటు నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. 

ఇక 16వ ఓవర్ నుంచి మళ్లీ బ్యాటింగ్ లో ఆరెంజ్ ఆర్మీ దూకుడు పెంచింది. యుజేంద్ర చాహల్ వేసిన మొదటి బంతిని సిక్స్, మూడో బాల్ ని ఫోర్ కొట్టి మంచి ఊపుమీదున్న అనికేత్ వర్మ (18) రనౌట్ అయ్యాడు.  అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన సలీల్ ఆరోరా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. కేవలం 9 రన్స్ మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఇక చివర్లో క్లాసెన్ కూడా పెవిలియన్ కి చేరడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 219 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ ముందు 220 పరుగుల టార్గెట్ ఉంది. పంజాబ్ బౌలర్లలో శాశంక్ సింగ్, అర్షదీప్ సింగ్ తలో రెండు వికెట్లు తీసుకోగా, జేవియర్ బార్ట్‌లెట్ ఒక వికెట్ పడగొట్టాడు.