సొంతగడ్డపై సన్ రైజర్స్ చిత్తు.. 7 రన్స్ తేడాతో ఢిల్లీ విక్టరీ

సొంతగడ్డపై సన్ రైజర్స్ చిత్తు.. 7 రన్స్  తేడాతో ఢిల్లీ విక్టరీ

హైదరాబాద్, వెలుగు: హోమ్ గ్రౌండ్ లో బౌలర్లు సూపర్ పెర్ఫామెన్స్ చేసి ప్రత్యర్థి టీమ్‌‌‌‌ను చిన్న స్కోరుకే కట్టడి చేశారు. కానీ, బ్యాటర్లు మళ్లీ చేతులెత్తేశారు. దాంతో 145 రన్స్ టార్గెట్‌‌‌‌ను  కూడా ఛేజ్ చేయలేకపోయిన సన్‌‌‌‌ రైజర్స్ హైదరాబాద్ వరుసగా మూడో మ్యాచ్‌‌‌‌లోనూ ఓడిపోయింది. ఉప్పల్ స్టేడియంలో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌‌‌‌లో  ఢిల్లీ క్యాపిటల్స్ 7 రన్స్ తేడాతో రైజర్స్‌‌‌‌పై  గెలిచింది. ఆ టీమ్‌‌‌‌కు ఇది రెండో విక్టరీ కాగా.. సన్ రైజర్స్‌‌‌‌కు ఓవరాల్​గా ఐదో పరాజయం. తొలుత  టాస్ నెగ్గిన ఢిల్లీ  20 ఓవర్లలో 144/9 స్కోరు చేసింది. మనీష్ పాండే (27 బాల్స్ లో 2 ఫోర్లతో 34), అక్షర్ పటేల్ (34 బాల్స్ లో 4 ఫోర్లతో 34) టాప్ స్కోరర్లు. రైజర్స్ బౌలర్లలో సుందర్ (3/28), భువనేశ్వర్ (2/11) కట్టడి చేశారు. ఛేజింగ్‌‌‌‌లో హైదరాబాద్ 20 ఓవర్లలో 137/6 స్కోరు మాత్రమే చేసి ఓడింది. మయాంక్ అగర్వాల్ (39 బాల్స్ లో 7 ఫోర్లతో 49), హెన్రిచ్ క్లాసెన్ (19 బాల్స్ లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 31), సుందర్ (15 బాల్స్ లో 3 ఫోర్లతో 24 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్, అన్రిచ్ చెరో రెండు వికెట్లు తీశారు. అక్షర్‌‌‌‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.

సూపర్ బౌలింగ్ 

పేస్ లీడర్ భువనేశ్వర్ కుమార్, స్పిన్నర్ సుందర్ సత్తా చాటడంతో ఢిల్లీని సన్ రైజర్స్ తక్కువ స్కోరుకే కట్టడి చేసింది.  ఫస్ట్ బాల్‌‌‌‌కే  ఓపెనర్ ఫిల్ సాల్ట్ (0)ను గోల్డెన్ డకౌట్ చేసిన  భువీ ఆ టీమ్‌‌‌‌కు షాకిచ్చాడు. జాన్సెన్ వేసిన రెండో ఓవర్లో మిచెల్ మార్ష్ (25) నాలుగు ఫోర్లు సహా 19 రన్స్ రాబట్టగా.. తన తర్వాతి ఓవర్లో భువీ ఒకే పరుగుతో కట్టడి చేశాడు. తర్వాత బౌలింగ్ కు వచ్చిన స్పిన్నర్ సుందర్‌‌‌‌కు.. వార్నర్ (21) 4, 6తో  వెల్‌‌‌‌కం చెప్పాడు. మార్ష్‌‌‌‌ను  నటరాజన్ ఎల్బీ చేయగా..  నాలుగో నంబర్ లో వచ్చిన సర్ఫరాజ్ (10) జాన్సెన్ బౌలింగ్‌‌‌‌లో  సిక్స్ కొట్టడంతో పవర్ ప్లేను ఢిల్లీ 49/2తో ముగించింది. సన్ రైజర్స్ తనను వదులుకున్న తర్వాత తొలిసారి హైదరాబాద్‌‌‌‌లో ఆడుతున్న వార్నర్...  మార్కండే బౌలింగ్‌‌‌‌లో ఫోర్‌‌‌‌తో  స్పీడు పెంచే ప్రయత్నం చేశాడు. కానీ, ఎనిమిదో ఓవర్లో స్పిన్నర్ సుందర్.. వార్నర్, సర్ఫరాజ్​తో  పాటు అమన్ ఖాన్ (4) ను ఔట్ చేసి ఢిల్లీకి ట్రిపుల్ స్ట్రోక్ ఇచ్చాడు. అతను లెగ్ స్టంప్‌‌‌‌పై వేసిన ఫుల్ లెంగ్త్ బాల్స్‌‌‌‌కు వార్నర్, సర్ఫరాజ్ ఇద్దరూ స్వీప్ షాట్లు ఆడి క్యాచ్ ఇచ్చారు. దాంతో క్యాపిటల్స్ 62/5తో కష్టాల్లో పడింది. ఈ దశలో మనీష్ పాండే, అక్షర్ పటేల్ నెమ్మదిగా ఆడుతూ 14.3 ఓవర్లలో స్కోరు వంద దాటించారు. మార్కండే వేసిన 17వ ఓవర్లో అక్షర్ హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. కానీ, రెండో స్పెల్‌‌‌‌లో బౌలింగ్‌‌‌‌కు వచ్చిన భువీ.. 18వ ఓవర్లో యార్కర్ తో అక్షర్‌‌‌‌ను బౌల్డ్ చేసి 5 రన్సే ఇచ్చాడు. ఆపై, పాండే, అన్రిచ్ (2), రిపల్ పటేల్​ (5) రనౌటవగా.. చివరి రెండు ఓవర్లలో 12 రన్స్ మాత్రమే చేసిన ఢిల్లీ అతి కష్టంగా140 మార్కు దాటింది.

చేజేతులా..

చిన్న టార్గెట్ ఛేజింగ్‌‌‌‌లో నింపాదిగా ఆడుతూ.. వరుసగా వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్  చేజేతులా ఓడింది. నాలుగో బాల్‌‌‌‌కే మార్ష్ క్యాచ్ డ్రాప్ చేయడంతో మయాంక్ అగర్వాల్ బతికిపోయాడు. తను ఓవర్ కో బౌండ్రీ కొట్టినా.. మరో ఎండ్‌‌‌‌లో హ్యారీ బ్రూక్ (14 బాల్స్ లో 7)ను ఆరో ఓవర్లో అన్రిచ్ బౌల్డ్ చేశాడు. దాంతో పవర్ ప్లేను 36/1తో ముగించిన సన్ రైజర్స్ తర్వాతి 4 ఓవర్లో ఒక్క బౌండ్రీ లేక సగం ఓవర్లకు 58/1తో డీలా పడింది. ఢిల్లీ స్పిన్నర్లు అక్షర్, కుల్దీప్‌‌‌‌తో పాటు మార్ష్ కట్టడి చేయడంతో మయాంక్, ఇంపాక్ట్ ప్లేయర్ రాహుల్ త్రిపాఠి (21 బాల్స్ లో 15)  స్లోగా బ్యాటింగ్ చేశారు. ఎట్టకేలకు 11వ ఓవర్లో మయాంక్ ఫోర్ కొట్టినా.. తర్వాతి 4 ఓవర్లలో అతనితో పాటు త్రిపాఠి, అభిషేక్ (5), కెప్టెన్ మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ (3) పెవిలియన్ చేరడంతో సన్ రైజర్స్ 85/5తో డిఫెన్స్‌‌‌‌లో పడింది. చివరి 5 ఓవర్లలో హోమ్ టీమ్‌‌‌‌కు 51 రన్స్ అవసరం కాగా, హిట్టర్ క్లాసెన్, ఆల్ రౌండర్ సుందర్ క్రీజులో ఉండటంతో ఫ్యాన్స్ ఆశలు వదులుకోలేదు. అన్రిచ్ వేసిన 17వ ఓవర్లో సుందర్ ఫోర్, క్లాసెన్ సిక్స్ కొట్టి రైజర్స్‌‌‌‌ను రేసులోకి తెచ్చారు. ఆపై ముకేశ్ బౌలింగ్‌‌‌‌లో క్లాసెన్ రెండు ఫోర్లు, సుందర్ ఓ ఫోర్ కొట్టడంతో సమీకరణం 12 బాల్స్ లో 23గా మారింది. 19వ ఓవర్లో  క్లాసెన్ ఔటైనా.. ఐదో బాల్‌‌‌‌కు సుందర్ ఫోర్ కొట్టాడు. చివరి ఓవర్లో రైజర్స్‌‌‌‌కు 13 రన్స్ అవసరం అవగా.. ముకేశ్ ఐదే ఇవ్వడంతో రైజర్స్‌‌‌‌కు ఓటమి తప్పలేదు.