రాజకీయాల్లో ఎన్టీఆర్ వర్సెస్ కృష్ణ 

రాజకీయాల్లో ఎన్టీఆర్ వర్సెస్ కృష్ణ 

సూపర్ స్టార్ కృష్ణ .. అక్కినేని నాగేశ్వరరావు స్ఫూర్తితో సినిమా రంగంలోకి వచ్చారు. ఎన్టీఆర్ తో కలిసి సినిమాల్లో నటించేందుకు ఆయన ఎంతో ఆసక్తి చూపేవారు. ఇందుకు అనుగుణంగా నందమూరి తారక రామారావుతో కలిసి ఎన్నో మల్టీ స్టారర్ మూవీస్ లో సూపర్ స్టార్ నటించారు.  అయితే రాజకీయాల విషయంలో కృష్ణ ఒకానొక దశలో ఎన్టీఆర్ తో విభేదించారు. ఇంతకీ ఎందుకు విభేదించారు ? అప్పటి పరిస్థితులు ఏమిటి ? రాజకీయాల్లో ఎంతకాలం పాటు కృష్ణ క్రియాశీలంగా ఉన్నారు ? అనేది తెలుసుకుందాం.. 

జై ఆంధ్ర ఉద్యమానికి మద్దతు

అది 1970వ దశకం. జై ఆంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న సమయం అది. అప్పట్లో ఈ ఉద్యమానికి సూపర్ స్టార్ కృష్ణ మద్దతు ప్రకటించారు. 1982 సంవత్సరంలో కృష్ణ నటించిన ‘ఈనాడు’ సినిమా టీడీపీకి అనుకూలంగా ఉందనే ప్రచారం జరిగింది. ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు ఆ మూవీ తోడ్పడిందని అందరూ భావించారు. 1983లో ఎన్టీఆర్ సీఎం అయ్యారు. ఈనేపథ్యంలో అప్పటివరకు  కృష్ణ , ఎన్టీఆర్ మధ్య మంచి సంబంధాలు కొనసాగాయి. అయితే 1984  సంవత్సరంలో ఉమ్మడి ఏపీలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. 1984లో ఎన్టీఆర్ ను కూలదోసి నాదెండ్ల భాస్కరరావు సీఎం పదవిని దక్కించుకున్నారు. దీనికి సంబంధించి అప్పట్లో న్యూస్ పేపర్లలో కృష్ణ ఇచ్చిన ఒక ప్రకటన రాజకీయ కలకలం రేపింది. నాదెండ్ల భాస్కరరావును కృష్ణ అభినందిస్తున్నట్టు ఆ ఫుల్‌పేజీ ప్రకటనలో ఉండటం వివాదాస్పదం అయింది. ఈ  సంఘటన కృష్ణకి, రామారావుకి మధ్య విభేదాలను మరింత పెంచింది. ఎన్టీఆర్ మళ్లీ సీఎం అయ్యాక ఈ విభేదాలు ఇంకా పెరిగాయి.

 

రాజీవ్ గాంధీ ఆహ్వానంతో..

ఇందిరా గాంధీ మరణించిన సమయంలో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన కృష్ణ.. అక్కడే రాజీవ్ గాంధీని తొలిసారి కలిశారు.  ఆ సమయంలో ఏపీలో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని అడ్డుకోవాలంటే కాంగ్రెస్ కు సినీ గ్లామర్ అవసరమని భావించిన రాజీవ్ గాంధీ.. కృష్ణను పార్టీలోకి ఆహ్వానించారు. 1984లో కాంగ్రెస్లో చేరిన కృష్ణ.. 1989లో కాంగ్రెస్ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. అనంతరం 1991 లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణ గుంటూరు ఎంపీ టికెట్ ఆశించినా పార్టీ ఏలూరులోనే పోటీ చేయించింది. అయితే ఆసారి టీడీపీ అభ్యర్థి బోళ్ల బుల్లి రామయ్య చేతిలో 47,655 ఓట్ల తేడాతో కృష్ణ ఓడిపోయారు. 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురికావడంతో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 2009 ఎన్నికల్లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కోరిక మేరకు కాంగ్రెస్ కు కృష్ణ కుటుంబం నైతిక మద్దతు ప్రకటించింది.